బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వివాదం ఉన్నత న్యాయస్థానానికి చేరుకుంది. బాప్టిజం ఘాట్ నిర్మాణ ప్రాంతం రెవెన్యూ డొంకా భూమిగా ఉందని న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సదరు పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన హైకోర్టు, మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణంపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు ఘాట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో వివాదం మరింత ఎక్కువైంది.
పుణ్య స్నానాల కోసమే బాప్టిజం ఘాట్ నిర్మాణం : క్రైస్తవ ప్రతినిధులు
ఈ మేరకు సర్కారు భూమిలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ నిలిపివేయాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాప్టిజం ఘాట్ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడ్డారు. మత మార్పిడిని ప్రోత్సహించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆళ్ల కుట్ర చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాప్టిజం ఘాట్ నిర్మాణానికి సర్కారు స్థలం ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.ఘాట్ మత మార్పిడి కోసం కాదని క్రైస్తవ ప్రతినిధులు వివరించారు. క్రైస్తవ సంప్రదాయాల్లో భాగంగా పుణ్యస్నానాల కోసమే నిర్మిస్తున్నామని చెప్పారు.