AP HOME MINISTER : హోంమంత్రి తానేటి వనితను అడ్డుకున్న స్థానికులు.. సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతను చవిచూశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు పరిధి దొమ్మేరులో బొంతా మహేంద్ర, ఎస్సీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడు మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు తానేటి వనితతో పాటు మరో మంత్రి మేరుగ నాగార్జున దొమ్మేరుకు వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి వారికి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పోలీసుల కారణంగానే మహేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ఘోరవ్ చేశారు. మరోవైపు మృతుడి బంధువులు, స్నేహితులు మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కలగజేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఫ్లెక్సీ కారణంగానే ముదిరిన గొడవలు
నవంబరు 6న దొమ్మేరులో 'గడపగడపకు వైసీపీ ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. అయితే స్థానికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో లోకల్ వైసీపీ నేతలు సతీశ్, నాగరాజుల ముఖాలు ఉన్న భాగాన్ని చింపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా పోలీసులు యువకుడు మహేంద్రను అనుమానితుడిగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వరకు ఠాణాలోనే ఉంచి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. స్టేషన్ బయటికి వచ్చిన అనంతరం అవమానభారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణం విడిచాడు. ఈ మేరకు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాకా, స్థానికులు పోలీసులపైకి తిరగబడ్డారు. ఉద్రిక్తతలతో మహేంద్ర అంత్యక్రియలు ముగిశాయి.