
AP Inter Hall Ticket: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్ మనమిత్రద్వారా ఇంటర్ హాల్‌టికెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నట్లు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఈ శుక్రవారం నుంచి వాట్సాప్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేట్ కళాశాలలు హాల్‌టికెట్లను నిలిపివేయకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతానికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
వివరాలు
ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా, హాల్‌టికెట్ల విషయంలో కీలక అప్‌డేట్ ప్రకటిస్తూ, విద్యార్థులు వాట్సాప్ నెంబర్ 95523 00009 ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. త్వరలో పదో తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధంగా హాల్‌టికెట్లు అందించే అవకాశం కల్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 10 నుండి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
వివరాలు
వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం
మీ ఫోన్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి. వాట్సాప్ సెర్చ్ బాక్స్‌లో "ఇంటర్ హాల్‌టికెట్" లేదా "Hi" అని టైప్ చేసి మెసేజ్ పంపండి. "మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్" నుండి మీకు రిప్లై వస్తుంది. వచ్చిన మెసేజ్‌లో "కింద సేవను ఎంచుకోండి" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందుబాటులో ఉన్న "విద్య సేవలు" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత "హాల్‌టికెట్" ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. గ్రీన్ సింబల్ కనిపించే హాల్‌టికెట్ల నుండి మీకు కావాల్సిన హాల్‌టికెట్‌ను ఎంపిక చేసుకోండి. మీ రోల్ నంబర్, ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేది వంటి వివరాలు నమోదు చేయండి. మీ హాల్‌టికెట్ స్క్రీన్ పై ప్రదర్శితం అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.
వివరాలు
ఇంటర్, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు: మార్చి 1 నుండి 19 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు: మార్చి 3 నుండి 20 వరకు ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.