Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై కొత్త జోన్ విధానం అమలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగాల ఉత్తర్వులు-2005"ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ప్రకటించింది. దీని ద్వారా ఇంతకాలం అమలులో ఉన్న 1975 ఉత్తర్వులు రద్దై,కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలను ఆధారంగా తీసుకుని కొత్త జోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల రెండు కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో,మొత్తం 28జిల్లాలకు అనుగుణంగా మరోసారి గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం 26 జిల్లాలు,ఆరు జోన్‌లు,రెండు బహుళ జోన్‌ల స్థాయిలో స్థానిక కేడర్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
వివరాలు
రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా ఉన్న పోస్టులు ఇకపై బహుళ జోన్ పోస్టులు
అన్ని పోస్టులను 27 నెలల వ్యవధిలో ఈ కొత్త కేడర్‌లలోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది. కొత్త నియమాల ప్రకారం జూనియర్ సహాయకుడు స్థాయి ,దానికి సమానమైన లేదా అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు జిల్లా యూనిట్ పరిధిలోకి వస్తాయి. జూనియర్ సహాయకుడి పై స్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు,మొదటి స్థాయి గెజిటెడ్ ఉద్యోగాలు జోన్ యూనిట్ పరిధిలో ఉంటాయి. ఇక ఆపై స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు,వాటికి సమానమైన ఉద్యోగాలు బహుళ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా ఉన్న పోస్టులు ఇకపై బహుళ జోన్ పోస్టులుగా పరిగణించబడతాయి.
వివరాలు
నేరుగా చేపట్టే ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు మరింత ప్రాధాన్యం
అయితే రాష్ట్ర సచివాలయం,విభాగాధిపతుల కార్యాలయాలు,ప్రత్యేక కార్యాలయాలు,సంస్థలు,రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, రాజధాని ప్రాంత పోలీసు ఉద్యోగాలకు ఈ స్థానిక నిబంధనలు వర్తించవు. ఇకపై నేరుగా చేపట్టే ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో 80:20, జోన్ స్థాయిలో 70:30 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర కోటాలు అమలులో ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన నియమాల ప్రకారం అన్ని స్థాయిల నేర నియామకాల్లో 95 శాతం స్థానికులకు, 5 శాతం స్థానికేతరులకు కోటా కేటాయిస్తారు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేని పరిస్థితిలో ఆ ఖాళీని మూడు సంవత్సరాల వరకు కొనసాగించే విధానం అమలు చేస్తారు. అలాగే కనీసం ఒక ఉద్యోగాన్ని సాధారణ వర్గానికి కేటాయించాలన్న నిబంధనను కూడా అమల్లో ఉంచారు.
వివరాలు
కొత్త జోనల్ వ్యవస్థ ఇలా..!
మల్టీ జోన్-1 జోన్1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు జోన్2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు జోన్3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు మల్టీ జోన్-2 జోన్4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు జోన్5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలు జోన్6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు