ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంతో పట్టుబట్టి దాదాపు 37 డిమాండ్లు సాధించామని, అందుకే ఉద్యమాన్ని విరమిస్తున్నామని ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గుంటూరు పట్టణంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉద్యోగులతో సమస్యల పరిష్కారం అంశాలపై చర్చించారు. పాత పెన్షన్ విధానానికి మాత్రమే ఏపీ జేఏసీ అమరావతి కోరుకుంటోందని, ఈ మేరకు ఓపీఎస్ విధానాన్నే ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ హామీ ఇచ్చింది ఏపీ సర్కారే : బొప్పరాజు
సీపీఎస్‌ని రద్దు చేస్తూ ఓపీఎస్‌ని అమలు చేయాలని ఆది నుంచి పోరాడింది తమ సంఘమేనని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునఃప్రవేశపెడతామని హామీ ఇచ్చింది ఏపీ సర్కారేనన్న బొప్పరాజు.. మళ్లీ తాము చలో విజయవాడను పునరావృతం చేయకూడదని ప్రభుత్వానికి స్పష్టతనిచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తుత సర్కారుకు ఇచ్చినంత సమయం, ఏ ప్రభుత్వానికీ ఇంతవరకు ఇవ్వలేదని బొప్పరాజు అన్నారు. మొత్తంగా ఉద్యోగులమంతా ఐక్యంగా 92 రోజులుగా అలుపెరగని పోరాటం చేశామని, ఫలితంగానే కావాల్సిన డిమాండ్లు సాధించుకోగలిగామన్నారు.