LOADING...
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రాజ్‌కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రాజ్‌కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రాజ్‌కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కెసిరెడ్డిని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలపై విచారణ చేపట్టిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాజ్‌కెసిరెడ్డి నివాసాలతో పాటు మరో ఆరుగురు నిందితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగాయి.

వివరాలు 

హవాలా మార్గాలు, మనీలాండరింగ్ ద్వారా భారీ మొత్తంలో నిధులు

ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. హవాలా మార్గాలు, మనీలాండరింగ్ ద్వారా భారీ మొత్తంలో నిధులు తరలించినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్‌కెసిరెడ్డిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేపడుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ భారీ మద్యం కుంభకోణంపై ఇప్పటికే ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.

వివరాలు 

కేసులో మొత్తం 33 మంది నిందితులు

ఈ కేసులో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చింది. రాజ్‌కెసిరెడ్డితో పాటు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ నేత విజయసాయిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజ్‌కెసిరెడ్డి బంధువు ముప్పిడి అవినాష్‌రెడ్డి, బూనేటి చాణక్య, టి. కిరణ్‌కుమార్‌రెడ్డి, సైఫ్ అహ్మద్ తదితరులను నిందితుల జాబితాలో చేర్చింది.

Advertisement

వివరాలు 

సరఫరా సంస్థలు, డిస్టిలరీల నుంచి దాదాపు రూ.3,200 కోట్ల మేర ముడుపులు

అంతేకాకుండా, మద్యం ముడుపుల సొమ్మును తరలించేందుకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న పలు డొల్ల సంస్థల యాజమాన్యాలపై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద మద్యం కుంభకోణాల్లో ఒకటిగా భావిస్తున్న ఈ కేసులో సరఫరా సంస్థలు, డిస్టిలరీల నుంచి దాదాపు రూ.3,200 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధులను కల్పిత, ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారులకు చేరవేసినట్లు అనుమానిస్తున్న ఈడీ, డబ్బు ప్రవాహానికి సంబంధించిన అసలు మూలాలను వెలికితీసేందుకు విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. రాజ్‌కెసిరెడ్డి అరెస్ట్‌తో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement