Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు.. డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌లో ఎన్నికల ప్రకటన విడుదల చేసి, డిసెంబర్ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగిస్తున్నది. కొత్త సంవత్సరానికి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అమరావతిలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరయ్యారు.
వివరాలు
123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన పనులు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, వార్డులు-డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలపై అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ జూన్ 26 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశముంది.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,291 గ్రామపంచాయితీలు
ఆ నివేదిక ఆధారంగా జులై నెలలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,291 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను అధికారులు విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రక్రియలను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి, ముందస్తుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది.