Ap New Ration Card Details : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా పెళ్లైన వారితో సహా, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపకల్పనను మార్చడం, కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఏపీలో 1 కోటి 48 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం,తక్కువ ధరకు కందిపప్పు,పంచదార వంటి ఇతర సరుకులను అందిస్తోంది.
కొత్త కార్డుల జారీ ప్రణాళిక
మిగిలిన కార్డులకు అవసరమైన రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నో కాలాలుగా కోరుతోంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారకుండా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వినియోగం పై సమీక్షలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, 1,36,420 పీహెచ్హెచ్ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు అని అధికారులు గుర్తించారు.
జనవరిలో కొత్త కార్డులు
ఈ కార్డులను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి ₹90కోట్ల వరకు ఆదా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థానంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని ప్రణాళికలో ఉంది. ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 1.5లక్షలకు పైగా పేద కుటుంబాలకు వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకరించాలని వేచి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల రూపురేఖలు మార్చబడ్డాయి, బియ్యం కార్డులు కూడా జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులపై వైఎస్ జగన్,రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి.కానీ రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో రేషన్ కార్డుల డిజైన్లు మారబోతున్నాయి.
3.36 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో
ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న కొత్త లేత పసుపు రంగు కార్డు నమూనాను పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, మార్పు చేర్పులు కోసం చాలా కార్డులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు, కార్డుల స్ల్పిట్ కోసం 46,918 దరఖాస్తులు, సభ్యులను యాడ్ చేసేందుకు 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588, అడ్రస్ మార్పు కోసం 8,263, సరెండర్ కోసం 685 దరఖాస్తులు ఉన్నాయి. మొత్తంగా 3.36 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి పెండింగ్లో ఉన్నాయి.