Loading...
AP Panchayat Polls: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి.. రెండు రోజుల్లో 16,505 నామినేషన్లు
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి.. రెండు రోజుల్లో 16,505 నామినేషన్లు

AP Panchayat Polls: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి.. రెండు రోజుల్లో 16,505 నామినేషన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తొలి రెండు రోజుల్లోనే సర్పంచ్ పదవుల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 16,505 నామినేషన్లు ఎన్నికల అధికారులకు అందాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 46 రెవెన్యూ డివిజన్లు, 214మండలాల పరిధిలోని 4,244గ్రామ పంచాయతీలకు మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈ నెల 21న తొలిరోజు 4,929నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజైన నిన్న అభ్యర్థుల నుంచి మరింత స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే 11,576 నామినేషన్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్య 16,505కు చేరింది.

వివరాలు 

తొలి విడత ఎన్నికలకు 62,730 మంది అభ్యర్థులు

నామినేషన్లు సమర్పించేందుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది.

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను డిసెంబర్ 2న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ఈ నెల 26న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల పరిధిలోని 3,949 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వీటిలో ఇప్పటికే 758 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 3,191 సర్పంచ్ స్థానాలతో పాటు 25,061వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ స్థానాల కోసం మొత్తం 62,730 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో తొలి విడత ఎన్నికలపై గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.

ADVERTISEMENT