Green Energy Corridor: నాలుగు దశల్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణం.. రూ.21,500 కోట్ల భారీ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను నాలుగు దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రతి దశను రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తూ, మొత్తం ప్రాజెక్టును 8 నుంచి 10 సంవత్సరాల్లో ముగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ కారిడార్ అభివృద్ధికి రూ.21,500 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సుమారు 11 వేల మెగావాట్ల సౌర విద్యుత్, 7,300 మెగావాట్ల నీటిని ఎత్తి నిల్వ చేసే విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను సరఫరా చేయాలంటే ప్రస్తుత నెట్‌వర్క్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
వివరాలు
వ్యయంలో 30 శాతం వరకు కేంద్రం సహాయం
ఆర్థిక ప్రణాళికను ఖరారు చేయడానికి, ప్రాజెక్టును ఎన్ని దశల్లో పూర్తి చేస్తారనే వివరాలను పంపాలని కేంద్రం ట్రాన్స్‌కోను కోరింది. మొత్తం వ్యయంలో సుమారు రూ.6,450 కోట్లు, అంటే 30 శాతం వరకు కేంద్రం సహాయంగా అందించనుంది. రాష్ట్రంలో విద్యుత్ ఎగుమతి విధానం కింద ఇప్పటివరకు సుమారు 80,798 మెగావాట్ల సౌర, గాలి, నీటిని నిల్వ చేసి ఉత్పత్తి చేసే విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 9,386 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 11,725 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తీరప్రాంతం,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించేందుకు బలమైన నెట్‌వర్క్ అవసరం.
వివరాలు
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు
ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా విద్యుత్‌ను జాతీయ స్థాయి గ్రిడ్‌కు అనుసంధానం చేసేలా ప్రసార వ్యవస్థను కూడా విస్తరించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ఉత్పత్తిలోకి వచ్చే ప్రాజెక్టులను అంచనా వేసి, దానికి అనుగుణంగా నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికను ట్రాన్స్‌కో సిద్ధం చేసింది. వచ్చే ఇరవై సంవత్సరాల పాటు విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ సామర్థ్యం భవిష్యత్తు అవసరాలకు సరిపోదని భావిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో డేటా కేంద్రాలు, భారీ పరిశ్రమలు ఏర్పాటుకానుండటంతో అదనపు విద్యుత్ సరఫరా కోసం నెట్‌వర్క్ విస్తరణ తప్పనిసరిగా మారింది.
వివరాలు
రాయలసీమలో 5,000 మెగావాట్ల సౌర, గాలి విద్యుత్ ప్రాజెక్టులు
ప్రస్తుతం రాయలసీమలో 5,000 మెగావాట్ల సౌర, గాలి విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విద్యుత్‌ను 17 ఉపకేంద్రాల ద్వారా కేంద్ర నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌లో భాగంగా 400 కేవీ సామర్థ్యం గల నాలుగు కొత్త ఉపకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రెండు అనంతపురంలో, ఒకటి కడపలో, మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించబడతాయి.