LOADING...
AP Police: ఏపీలో నేరాలకు చెక్: 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్'తో పోలీసులకు సూపర్ పవర్
ఏపీలో నేరాలకు చెక్

AP Police: ఏపీలో నేరాలకు చెక్: 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్'తో పోలీసులకు సూపర్ పవర్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను అదుపులో పెట్టేందుకు పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా పాత నేరస్థులను గుర్తించడం,అనుమానితుల వివరాలను వెంటనే తెలుసుకోవడం కోసం 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్' అనే ఆధునిక పరికరాన్ని ప్రవేశపెట్టింది. ఈ డివైస్‌తో కేవలం కొన్ని సెకన్లలోనే వ్యక్తి నేర చరిత్రను వెలికితీయడం సాధ్యమవుతుంది. దీంతో నేర నియంత్రణ మరింత కట్టుదిట్టం కానుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరిమాణంలో చిన్నదిగా,బరువులో తేలికగా ఉండటం వల్ల పోలీసులు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలుగుతారు. దీనిని మొబైల్‌లోని ప్రత్యేక యాప్‌తో కనెక్ట్ చేసి ఉపయోగిస్తారు. అనుమానితుడు తన బొటన వేలు లేదా చూపుడు వేలి ముద్రను స్కానర్‌పై ఉంచగానే, ఆ డేటా వెంటనే పోలీస్ డేటాబేస్‌తో సరిపోల్చుకుంటాయి.

వివరాలు 

కొత్త టెక్నాలజీతో ఆ సమస్యలకు చెక్

రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసులు నమోదై ఉంటే,లేదా రౌడీ షీట్ ఓపెన్‌లో ఉంటే,అన్ని వివరాలు క్షణాల్లో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. కేసు ఎక్కడ నమోదైంది,ఏ సెక్షన్ కింద ఉంది వంటి పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఎలాంటి రికార్డు లేకపోతే 'నాట్ ఫౌండ్' అని చూపిస్తుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నేరస్థులు సాధారణ ప్రయాణికుల మధ్య కలిసిపోయి నేరాలకు పాల్పడడం పోలీసులకు పెద్ద సవాలుగా ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులను గుర్తించడం కూడా కష్టసాధ్యమయ్యేది. ముఖ్యంగా రాత్రి గస్తీ సమయంలో అనుమానితులను ప్రశ్నించినా,వారి గత నేర చరిత్ర తెలుసుకోవడానికి ఆలస్యం అవుతుండేది. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో ఆ సమస్యలకు చెక్ పడనుంది.

వివరాలు 

ఈ పరికరం కీలక పాత్ర

'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్' అందుబాటులోకి రావడంతో పోలీసుల పనితీరు మరింత వేగవంతం కానుంది. అనుమానితుల వివరాలను వెంటనే ధృవీకరించడం, నేరస్థుల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం ద్వారా నేరాలు జరగకముందే అడ్డుకునే అవకాశం పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నేర నియంత్రణలో ఈ పరికరం కీలక పాత్ర పోషించనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement