Andhra Pradesh: ఏపీ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 1.39% మాత్రమే.. జాతీయ సగటు కన్నా తక్కువ.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం, దేశస్థాయి సగటు ద్రవ్యోల్బణం 1.72%గా ఉంది. అదే సమయంలో ఏపీలో 1.39% మాత్రమే లెక్కించబడింది. రాష్ట్రంలో క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోందని ఆర్థిక సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. వస్తువులు, సేవల ధరలు పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది; తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. మన దేశంలో వినియోగదారుల ధరల సూచిక (CPI),హోల్సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా ద్రవ్యోల్బణం లెక్కించబడుతుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CPI ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తోంది.
వివరాలు
అర్బన్ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం కొంచెం ఎక్కువ
సామాన్య కుటుంబం ఏం కొంటుంది అనే అంశాల ఆధారంగా ఇది లెక్కిస్తారు. బియ్యం, కూరగాయలు, పాలు, ఇంధనం, వస్త్రాలు, విద్యుత్ ఛార్జీలు, వైద్య ఫీజులు, ఇంటి అద్దె వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతిమాసం ద్రవ్యోల్బణం లెక్కిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డేటా ఈ సర్వేలో వివరించారు. అర్బన్ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం కొంచెం ఎక్కువగా ఉందని సర్వేలో స్పష్టమైంది.
వివరాలు
గత ఆర్థిక సంవత్సరాల ఫలితాలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 7.57% ద్రవ్యోల్బణం నమోదయింది, జాతీయ సగటు 6.66%గా ఉంది. 2023-24లో రాష్ట్రంలో 5.54%గా నమోదు కాగా, జాతీయ సగటు 5.36%గా ఉంది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్బణం 4.41%కు చేరగా, జాతీయ సగటు 4.63%గా ఉంది. డిసెంబర్ వరకు మాత్రమే రాష్ట్రంలో 1.39% ద్రవ్యోల్బణం నమోదు కావడం శుభ సంకేతం. రిటైల్ ద్రవ్యోల్బణం సాధారణంగా 2% నుంచి 6% మధ్య ఉండాలని రిజర్వ్ బ్యాంక్ సూచిస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం పరిమితిని మించిపోయింది. ఉదాహరణకు, కేరళలో డిసెంబర్ వరకు 8.05%, లక్షద్వీప్‌లో 6.69% ద్రవ్యోల్బణం నమోదు అయింది.