Andhra Pradesh: ఏపీలో 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. వచ్చే ఏడాది జూన్‌లో కార్డులు పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలోని ప్రతి కుటుంబానికి ఒకే కార్డు ద్వారా సౌకర్యాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు విధానం ద్వారా పౌరసేవలు మరింత సులభంగా, సమగ్రంగా అందనున్నాయి. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ, ప్రభుత్వ పథకాల కోసం ఒకే కార్డు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ముఖ్యమంత్రి జూన్ 2026 నాటికి రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు QR కోడ్ కలిగిన ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్డులో 25 రకాల సమాచారాలు,అలాగే P-4 వంటి ఇతర కీలక అంశాలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (FBMS)అమలు చేయాలని సీఎం సూచించారు.
వివరాలు
స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను నమోదు చేయాలని సూచించిన సీఎం
సోమవారం సచివాలయంలో సీఎం ఈ FBMS పై సమీక్ష నిర్వహించారు.ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి, పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యాన్ని సీఎం స్పష్టంచేశారు. ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్,డేటా సేకరణ,RTGS వంటి వాస్తవ డేటా ఆధారంగా ఇతర శాఖలు కూడా ఉపయోగించుకునే విధంగా ఉండాలని చెప్పారు. సమాచారం ఎప్పటికప్పుడు నవీకరించబడేలా స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను నమోదు చేయాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్, ఆధార్,FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్, పెన్షన్లు వంటి వేర్వేరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని వివరాలను ఈ కార్డు ద్వారా ట్రాక్ చేయడం అవసరం అని పేర్కొన్నారు.
వివరాలు
అర్హులైన ప్రతి వ్యక్తికి సులభంగా పథకాలు, పౌర సేవలు
కేవలం రేషన్ లేదా పెన్షన్ పథకాలకి మాత్రమే పరిమితం కాకుండా, ప్రజలకు చెందిన అన్ని ముఖ్యమైన వివరాలు ఒకే కార్డు ద్వారా తెలుసుకోవచ్చునని సీఎం తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి వ్యక్తికి సులభంగా పథకాలు, పౌర సేవలు అందించగలుగుతుందని చెప్పారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయన్నారు.
వివరాలు
స్మార్ట్ కార్డు ద్వారా పౌరులకు అన్ని సేవలు అందించడం ప్రధాన లక్ష్యం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించడం, స్మార్ట్ కార్డు ద్వారా పౌరులకు అన్ని సేవలు అందించడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు, ఆధార్ సహా అన్ని వివరాలు ఒకే కార్డు ద్వారా సులభంగా తెలిసే విధంగా రూపొందించాలి. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి, జూన్ నాటికి అన్ని కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.