ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్
ఏపీలో ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడం, మరోవైపు జూన్ 20 గడుస్తున్నా అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యుత్ డిమాండ్ ఎవరూ ఊహించనంత భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిస్కంల చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పినట్లైంది. ఈ మేరకు జూన్ 17న, శనివారం ఏకంగా 260.96 మిలియన్ యూనిట్లకు చేరుకోవడం విద్యుత్ వర్గాల్లోనే సంచలనంగా మారింది. జూన్ మూడో వారంలోనూ వర్షాలు లేక విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. మే 15 నుంచి క్రమంగా విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) అంచనా. అయితే విద్యుత్ అధికారులే ముక్కున వేలేసుకునేలా జూన్ మూడో వారం గడిచిపోతున్నా డిమాండ్ మాత్రం తగ్గకపోవడం కొసమెరుపు.
జూన్ మూడో వారంలోనూ వేసవిలో మాదిరే విద్యుత్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో సరిపడ కరెంట్ ను సరఫరా చేసేందుకు, విద్యుత్ సంస్థలు ఓపెన్ మార్కెట్‌పై ఆధారపడాల్సి దుస్థితి నెలకొంటోంది. ఏటా జూన్ మొదటి వారమే వాతావరణం చల్లబడటం, దీంతో విద్యుత్ డిమాండ్ తగ్గడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా తయారైంది. మండు వేసవిని మించి విద్యుత్ వాడకం అధికంగా ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. బహిరంగ మార్కెట్ ధరలు.. జూన్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో వేసవిలో మాదిరే విద్యుత్ డిమాండ్ నెలకొంది.
డిమాండ్ మేరకు విద్యుత్ సప్లై చేస్తున్నాం : ఏపీ డిస్కంలు
విద్యుత్ వాడకం పీక్ డిమాండ్ లో ఉన్న సమయంలో యూనిట్ కరెంట్ కు రూ.10 (గరిష్ఠ ధర)ను చెల్లిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ( డిస్కంలు ) విద్యుత్ ను కొంటున్నాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో అంతే మొత్తంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రతి రోజూ కనీసం 15 - 25 ఎంయూలను అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని డిస్కంలు చెబుతున్నాయి. 2023 వేసవి నెలల్లో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ : నెల విద్యుత్ డిమాండ్ ( మిలియన్ యూనిట్లు ) మార్చి 15 232.72 ఎంయూ ఏప్రిల్ 20 247.822 ఎంయూ మే 17 255. 230 ఎంయూ జూన్ 17 260. 96 ఎంయూ