AP - TG Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. బలపడిన అల్పపీడనం.. ఎల్లో అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. మరోవైపు రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం మధ్య నుంచి కొనసాగుతూ.. అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వివరాలు
తెలంగాణలో వర్షసూచన..
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబ్‌నగర్, కరీంనగర్, కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆయా ప్రాంతాల్లో 5 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
వివరాలు
ఏపీలోనూ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాలకు వర్షసూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని పేర్కొంది.
ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.