LOADING...
VB G RAM G: జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలు..
జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలు..

VB G RAM G: జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలు..

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి రూ.7,973 కోట్ల వ్యయంతో 'వికసిత భారత్‌-ఉపాధి, జీవనోపాధి హామీ గ్రామీణ పథకం' అమలుకానుంది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేరకు రూ.4,784 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాగా రూ.3,189 కోట్లు భరించనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా ఈ కొత్త పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమాచారం పంపింది.

వివరాలు 

వచ్చే నెలలో అధికారిక ప్రకటన

మొదట ఈ పథకాన్ని ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేయాలని భావించినప్పటికీ, పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల జూన్‌ చివరి వరకు పాత ఉపాధి హామీ పథకాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. కొత్త పథక అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఇప్పటికే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో అవసరమైన నిధులను కేటాయించింది. పథకం అమలును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ మండలిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి మార్గదర్శక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికారులు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికను ఈ కమిటీ పరిశీలించి ఆమోదించనుంది.

వివరాలు 

పరిపాలన ఖర్చులకు అధిక నిధులు

ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పరిపాలన ఖర్చుల కోసం మొత్తం వ్యయంలో 5.5 శాతం నిధులు కేటాయిస్తున్నారు. కొత్త పథకంలో ఈ వాటాను 9 శాతానికి పెంచుతున్నారు. ప్రస్తుతం పరిపాలన ఖర్చుల కింద సుమారు రూ.500 కోట్లు లభిస్తుండగా, కొత్త విధానంలో ఇది దాదాపు రూ.1,000 కోట్లకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధులను క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణ, రవాణా, ఇతర పరిపాలన అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ వ్యయంలో కూడా కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున భారం మోయనున్నాయి.

Advertisement

వివరాలు 

పథకంలోని ముఖ్యాంశాలు

ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకంలో 100 రోజుల ఉపాధి మాత్రమే అందిస్తున్నారు. కార్మికులకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు, ఈ-కేవైసీ విధానాలు తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం ఈ-కేవైసీ పూర్తి అయింది. ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని గత నెలలో ప్రారంభించారు. కార్మిక కుటుంబాలకు ప్రత్యేక గ్రామీణ ఉపాధి హామీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. వ్యవసాయ పనుల సమయంలో కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా 60 రోజులపాటు ఉపాధి హామీ పనులకు విరామం ఇవ్వనున్నారు.

Advertisement