Palle Panduga 3.0: రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. రేపు ఉదయగిరిలో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పల్లె పండుగ 3.0' కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మొత్తం రూ.11,085కోట్ల అంచనా వ్యయంతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను చేపట్టనుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ నెల 29న నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. గత రెండేళ్లలో 'పల్లె పండుగ 1.0', 'పల్లె పండుగ 2.0' కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. సిమెంట్ రోడ్లు,కాలువలు,పశువుల షెడ్లు,పశువుల నీటి తొట్టెలు,వ్యవసాయ కుంటలు, మ్యాజిక్ డ్రెయిన్లతో పాటు ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించారు.
వివరాలు
పల్లె పండుగ 3.0లో ప్రధాన పనులు ఇవే..
ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూర్చాయి.
గ్రామాల్లో రూ.2,700 కోట్లతో 6 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు.
రూ.7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల మేర తారు రోడ్ల పనులు చేపట్టనున్నారు.
పాడి రైతుల కోసం రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలను నిర్మించనున్నారు.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో తోటల పెంపకాన్ని ప్రోత్సహించనున్నారు.
రూ.110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు.
రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
వివరాలు
పల్లె పండుగ 1.0లో..
ఈ కార్యక్రమం కింద కేటాయించిన మొత్తం రూ.11,085 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.5,391 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లను సమకూర్చనున్నాయి.
వీబీ జీరామ్‌జీ కింద రూ.1,750 కోట్లు, గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ కింద రూ.3,800 కోట్లు, నాబార్డు, సాస్కీ, ఇతర మార్గాల ద్వారా మరో రూ.2 వేల కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
'పల్లె పండుగ 1.0' కింద గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మించారు.
22,514 పశువుల షెడ్లు, 21 వేల వ్యవసాయ పంట కుంటలు ఏర్పాటు చేశారు. అలాగే 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకాన్ని చేపట్టారు.
వివరాలు
పల్లె పండుగ 2.0లో..
'పల్లె పండుగ 2.0' కింద 2,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించారు.
15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు.
86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించారు.