LOADING...
Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు
కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు

Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అనవసర చట్టాల తొలగింపుకు కేంద్రం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిందని,ఆ ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెడుతున్న ఏఐ సావరిన్‌తో పాటు ప్రపంచంలోని ఉత్తమ విధానాలు,సాంకేతికతలను స్వీకరించి స్పష్టమైన ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దశ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా అడుగులు వేశామని, ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందించేలా 'స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌' విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

వివరాలు 

నెలకు రెండుసార్లు క్యాబినెట్‌, మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు

సోమవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో సమావేశం జరగగా, ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం, వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ హామీలను అమలు చేస్తూ 19 నెలలుగా సమర్థంగా పనిచేస్తున్నామని, సూపర్‌ సిక్స్‌ హామీలు సహా సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనకు సమతుల్యంగా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నెలకు రెండుసార్లు క్యాబినెట్‌, మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహణతో పాటు ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీ ద్వారా పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం ఇస్తున్నామని, జిల్లాల స్థాయిలోనూ ఇన్‌ఛార్జ్‌ మంత్రులు నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ ఇదే బృందస్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

వివరాలు 

రోజువారీ జీవితంలోనూ డీప్‌ టెక్నాలజీ వినియోగం

ప్రభుత్వ సమాచారాన్ని సింగిల్‌ పోర్టల్‌లో ఏకీకృతం చేసి ఏఐ అప్లికేషన్లను వినియోగిస్తున్నామని సీఎం తెలిపారు. క్వాంటమ్‌ వ్యాలీకి శంకుస్థాపనతో క్వాంటమ్‌ కంప్యూటర్లు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ చేరనుందని, రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటమ్‌ కంప్యూటర్ల తయారీ ప్రారంభించి ప్రపంచానికి అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డేటా సెంటర్లు భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని పూర్తిగా మార్చనున్నాయని, రోజువారీ జీవితంలోనూ డీప్‌ టెక్నాలజీ వినియోగం విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల దావోస్‌ పెట్టుబడుల సదస్సులో ఏఐ ద్వారా ఆర్థిక వృద్ధి, గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం ప్రభావాలపై దేశాల అనుభవాలను చర్చించినట్లు తెలిపారు.

Advertisement

వివరాలు 

కోస్తాంధ్రలో మత్స్య, వాణిజ్య పంటల సాగు పెరిగి సత్ఫలితాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు వెచ్చించామని,ఉద్యాన సాగును ప్రత్యేక ప్రాజెక్టులుగా ప్రోత్సహించి సాగునీటి వసతి పెంచి రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం వివరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఉద్యాన రంగంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రప్పించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో సేద్యం దెబ్బతిని రైతుల ఆత్మహత్యలు పెరిగాయని,ఆ పరిస్థితిని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులు,విద్యార్థుల ఆత్మహత్యల వెనుక కారణాలపై ఆడిట్‌ చేయాలని ఆదేశించామని,నివారణకు విధానపరమైన పరిష్కారాలు తీసుకువస్తామని తెలిపారు. పొగాకు,మామిడి,కోకో, ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.1,100 కోట్లు అందించిందని, కోస్తాంధ్రలో మత్స్య, వాణిజ్య పంటల సాగు పెరిగి సత్ఫలితాలు సాధించామని చెప్పారు.

Advertisement

వివరాలు 

రూ.వెయ్యి కోట్లతో మళ్లీ డయాఫ్రం నిర్మాణం 

అమరావతిపై గతంలో చేసిన విమర్శలు నిలువెల్లా తప్పని నిరూపితమయ్యాయని, ప్రస్తుతం రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయని సీఎం అన్నారు. మూడేళ్లలో అమరావతికి స్పష్టమైన రూపం తీసుకొస్తామని, మోస్ట్‌ లివబుల్‌ సిటీల అవసరాన్ని కేంద్రం కూడా గుర్తించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్‌ను రూ.వెయ్యి కోట్లతో మళ్లీ నిర్మిస్తున్నామని, ఇది మార్చిలో పూర్తవుతుందని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు.

వివరాలు 

సంపూర్ణంగా చెత్త తొలగింపు

వ్యర్థాల నిర్వహణపై మాట్లాడుతూ, గతంలో గుంతలు-మైదానాల్లో చెత్త పోసి కాలుష్యానికి దారి తీసారని, తమ ప్రభుత్వం వచ్చాక 105 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించామని, మార్చిలోగా 100 శాతం శుభ్రత సాధిస్తామని చెప్పారు. రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు ఖర్చు చేసి, మరిన్ని పనులకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.4 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, జీరామ్‌జీ అమలుతో వచ్చే అదనపు భారం ఎదుర్కొనేందుకు ఆదాయం తెచ్చే ఆస్తుల సృష్టిపై దృష్టి పెడతామని చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ కొనసాగిస్తూ రూ.25 వేల కోట్లతో ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామని వెల్లడించారు.

వివరాలు 

గూగుల్‌దే అతిపెద్ద పెట్టుబడి

విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర-రాష్ట్ర సహకారంతో తొలిసారిగా లాభాల బాట పట్టి రూ.54 కోట్ల ఆదాయం సాధించిందని సీఎం తెలిపారు. విశాఖ ఐటీ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో గూగుల్ సంస్థ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు, ఇది దేశ ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చిన అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 5 గిగావాట్‌ సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటవుతుండగా, ఇప్పటికే రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ముందుకొచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేశామని చంద్రబాబు తెలిపారు.

Advertisement