LOADING...
AP Weather: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

AP Weather: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల కొన్ని ప్రాంతాల నుంచి రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్లేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, నైరుతి బంగాళాఖాతం,దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.

వివరాలు 

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 

అలాగే,మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం,నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని,అది నైరుతి బంగాళాఖాతం-దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న మరో ఆవర్తనంతో మిళితమైందని వివరించింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు, యానాం ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశముందని తెలిపింది.

వివరాలు 

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

అలాగే, సోమవారం (13వ తేదీ) అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఆదివారం నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 32.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 32.2 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.