Loading...
Centre-Meta: మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి.. మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి.. మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు

Centre-Meta: మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి.. మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్‌లో కొంతసేపు తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ మూడు రోజుల గడువు విధించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అధ్యక్షతన పనిచేస్తున్న ఈ పార్లమెంటరీ కమిటీ, ప్రధానమంత్రి వీడియోను తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి వీడియో కొంతసేపైనా అందుబాటులో లేకపోవడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొంది.

వివరాలు 

'సేఫ్ హార్బర్' రక్షణపై హెచ్చరిక

మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే ఫేస్‌బుక్‌కు ప్రస్తుతం అమల్లో ఉన్న 'సేఫ్ హార్బర్' రక్షణను ఉపసంహరించుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.

అలాంటి పరిస్థితి ఏర్పడితే సోషల్ మీడియా సంస్థ అధికారులపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది.

వివరాలు 

మోదీ వీడియో తొలగింపుతో వివాదం

జులై 23న ప్రధాని నరేంద్ర మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. అనంతరం అదే వీడియోను ఫేస్‌బుక్‌లో కూడా పంచుకున్నారు.

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ వీడియోలో హామీ ఇచ్చారు.

అయితే కొద్దిసేపటికే ఆ వీడియో ఫేస్‌బుక్‌లో కనిపించకుండా పోవడంతో వివాదం మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంతో మెటా వెంటనే ఆ పోస్టును తిరిగి పునరుద్ధరించింది.

ADVERTISEMENT

వివరాలు 

సాంకేతిక లోపం వివరణపై అసంతృప్తి

ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన మెటా ప్రతినిధులు, వీడియో తొలగింపు పూర్తిగా సాంకేతిక లోపం వల్లే జరిగిందని వివరణ ఇస్తూ క్షమాపణలు తెలిపారు.

అయితే ఈ వివరణపై కేంద్ర ఐటీ శాఖ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేదు.

నిజంగా సాంకేతిక సమస్య కారణమే అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని మెటాకు సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

చిన్నారుల భద్రతపై మరోసారి హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ ప్రకటనల రూపంలో కనిపిస్తున్న వ్యవహారంపై ఇప్పటికే మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ఈ అంశాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ మరోసారి ప్రస్తావిస్తూ సంస్థను హెచ్చరించింది.

అంతేకాకుండా గూగుల్, యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలు చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను అరికట్టేందుకు అమల్లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిటీ స్పష్టం చేసింది.

నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటే సంబంధిత సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని హెచ్చరించింది.

ADVERTISEMENT