LOADING...
Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 17ను భారత మహిళల కోసం "బ్లాక్ డే"గా పేర్కొంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలకు మోసం చేశారని ఆరోపించారు. దక్షిణ భారత ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేశారని, మహిళల సాధికారత కోసం "నారి వందన్" వంటి కార్యక్రమాలను తీసుకొచ్చారని తెలిపారు. డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు నిలిచిపోవడాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబరంగా జరుపుకుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ అసలు లక్ష్యం ఏమిటని ప్రశ్నిస్తూ, దేశాన్ని విభజించడమే వారి ఉద్దేశమని ఆరోపించారు.

వివరాలు

బిల్లు వెనుక పదేళ్ల కృషి ఉంది

లోక్‌సభలో అమిత్ షా ఒక గంట సమయం ఇస్తే అన్ని సందేహాలకు సమాధానాలు ఇస్తానని చెప్పారని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ప్రధాని మోదీ పదేళ్ల కృషి ఉందని ఆమె పేర్కొన్నారు. బాలికల కోసం విదేశీ విద్య, పాఠశాలలు, స్కాలర్‌షిప్‌లు వంటి అనేక అవకాశాలు కల్పించారని చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రవేశపెట్టిన రుణ పథకాల ద్వారా సుమారు 3 కోట్ల మహిళలు లక్షాధికారులు అయ్యారని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని మోదీ సంకల్పించారని చెప్పారు. బాలికలను ఉన్నత చదువులకు పంపే పరిస్థితిలేకపోయేదని, హాస్టళ్లలో ఉంచడం గానీ, ఉద్యోగాలకు పంపడం గానీ జరగలేదని గుర్తు చేశారు.

వివరాలు

మహిళా బిల్లు విషయంలో అన్యాయం జరిగింది

కేవలం వివాహం చేసి అత్తవారింటికి పంపే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, మహిళలు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. మహిళలు విమానాలు నడుపుతున్నారని, ఉద్యోగాల్లో ముందంజలో ఉన్నారని, ఈ మార్పులు మోదీ ప్రధాని అయిన తర్వాతే వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. మహిళా బిల్లులో నిజంగా అన్యాయం చేసింది ప్రతిపక్షాలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచుతామని అమిత్ షా ప్రకటించారని గుర్తు చేశారు.

Advertisement

వివరాలు

రాహుల్ గాంధీ ప్రవర్తనను అందరూ గమనించాలి

కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మహిళా నేతలకే మహిళా బిల్లు ఆమోదం పొందుతుందా అనే అనుమానం ఉందని చెప్పారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రవర్తనను అందరూ గమనించారని, ప్రతిపక్ష నాయకుడిగా ఎలా మాట్లాడాలో ఆయనకు తెలియదని విమర్శించారు. ఇండియా కూటమి నల్ల దుస్తులతో నిరసనలు చేపట్టడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. మహిళలు ఇంకా ఎన్నాళ్లు ఎంపీ లేదా ఎమ్మెల్యే అవ్వడానికి ఎదురు చూడాలని ప్రశ్నించారు. మహిళలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారని తెలిపారు. ఇక రాష్ట్రాల రాజకీయాలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.

Advertisement

వివరాలు

తులం బంగారం పేరుతో మోసం చేశారు

తెలంగాణలో మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ఇచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. ఉచిత బస్సు సేవల పేరుతో 20 శాతం కూడా బస్సులు అందుబాటులో లేవని అన్నారు. తెలంగాణలో పెళ్లి అయిన వారికి తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ప్రజలను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు.

Advertisement