Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పలువురు ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పవన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా, రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని వారు కోరారు. ఈ సమస్యపై స్పందించిన పవన్, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పెండింగ్ జీతాల కోసం అధికారులకు ఆదేశాలు జారీ
పెండింగ్ జీతాల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగురాలు సుజన కుమారి కూడా తన సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. కడప జిల్లా కమలాపురం ల్యాబ్‌లో పది సంవత్సరాలుగా హెల్పర్‌గా పని చేస్తున్న ఆమెను మూడు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేకపోవడం, బరువు పనులు చేయలేని స్థితిలో ఉండటం వంటి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో ఉద్యోగం తిరిగి ఇప్పించాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. వెంటనే ఈ విషయంపై అధికారులతో మాట్లాడతానని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.