APSRTC: వృద్దులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ .. 25 శాతం రాయితీ.. మార్గదర్శకాలు జారీ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) వృద్ధులకు బస్సుల్లో ప్రయాణించడానికి రాయితీ టికెట్లు జారీ చేసే విధానం పై మార్గదర్శకాలను సిబ్బందికి మరోసారి జారీ చేసింది. డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఆదేశాలను జారీ చేశారు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు 25% రాయితీ టికెట్లు ఇస్తున్నది. కానీ, వృద్ధులు తమ వయస్సును నిర్ధారించడానికి అవసరమైన గుర్తింపు కార్డులను చూపిస్తుంటే బస్సులో వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇది ప్రధానంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీతో మాత్రమే టికెట్‌లు జారీ చేయాలని సిబ్బంది ఆదేశించిన సందర్భంలో కనిపించింది. ప్రభుత్వ స్థాయిలో జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులను సిబ్బంది అంగీకరించకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.
ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
ఇప్పటికే,వృద్ధులు ఆధార్ కార్డు లేకపోతే,డిజిటల్ గుర్తింపు కార్డులను కూడా చూపించి రాయితీ పొందవచ్చని ఆర్టీసీ పేర్కొన్నప్పటికీ,అవగాహన లోపంతో సిబ్బంది టికెట్లు జారీ చేయడం లేదు. ఈ కారణంగా, పలు ప్రాంతాల్లోని వృద్ధులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇది దృష్ట్యా,ఆర్టీసీ తాజాగా సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి వృద్ధులు తమ ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి రాయితీ టికెట్లను పొందవచ్చు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే,ఫోన్‌లో ఉన్న డిజిటల్ కార్డుల ఆధారంగా కూడా రాయితీ టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ స్పష్టం చేసింది.