APSRTC: ప్రయాణికుల రద్దీకి చెక్.. రోడ్డెక్కనున్న 2,500 కొత్త బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 2,500 కొత్త బస్సులు త్వరలో రోడ్లపైకి రానున్నాయని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ ఎన్.టి. కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం ఆర్టీసీ హౌస్‌లో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన,అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సేవల మెరుగుదలతో పాటు కొత్త బస్సుల ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం బస్సుల్లో కనిపిస్తున్న ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గనుంది. ఎక్కువ మంది సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం కలగనుంది.
వివరాలు
ఏపీకి 1,050 ఎలక్ట్రిక్ బస్సులు
ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని మరింత సులభంగా వినియోగించుకునేందుకు ఈ కొత్త బస్సులు దోహదపడనున్నాయని అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్ని బస్సులు రానున్నాయంటే.. ఏపీలో 2,500 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఎండీ కృష్ణబాబు స్పష్టం చేశారు. పీఎం ఈ-బస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీకి కేటాయించిందని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 1,450 ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ బస్సులన్నీ కలిపి మొత్తం 2,500 కొత్త బస్సులు ఏపీఎస్‌ఆర్టీసీకి అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
ఈ ఏడాది చివరికల్లా ఎలక్ట్రిక్ బస్సులు
ఈ కొత్త బస్సుల రాకతో ఆర్టీసీ బస్సుల సామర్థ్యం మరింత పెరగనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చినప్పటి నుంచి బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో సీట్లు ఖాళీగా లేక, మహిళల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్న సంఘటనలు కూడా నమోదవుతున్నాయి. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతుండటంతో ఇతర ప్రయాణికులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహిళలతో పాటు ఇతర ప్రయాణికులకూ ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. ఈ ఏడాది చివరికల్లా కేంద్ర ప్రభుత్వం అందించే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
వివరాలు
పాత బస్సులను స్థానంలో కొత్త బస్సులు
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులు కూడా ఈ ఏడాదిలోనే ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఈ ఏడాది ఏపీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో అనేక బస్సులు కాలం చెల్లిపోవడంతో నిర్వహణ భారంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణం మధ్యలో బస్సులు ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా పాత బస్సులను తొలగించి కొత్త బస్సులను తీసుకురానున్నారు. కాగా, ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా తిరుమలరావు స్థానంలో ఎన్.టి. కృష్ణబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు సౌకర్యవంతమైన మరియు భద్రమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.