Andhra Pradesh: ఏపీ రోడ్లపైకి 5,500 విద్యుత్ బస్సులు,500 సీఎన్‌జీ బస్సులు.. వచ్చే నెల నుంచి దశలవారీగా పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తన బస్సు దళాన్ని ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. కాలపరిమితి ముగిసిన, అధిక కిలోమీటర్లు ప్రయాణించిన పాత బస్సుల స్థానంలో కొత్త విద్యుత్, సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. మొత్తం 6 వేల బస్సులను దశలవారీగా తీసుకురానుండగా, వాటిలో 5,500 విద్యుత్ బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులు ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ సర్వీసుల్లో కాలం చెల్లిన బస్సులను తొలగించి, వాటి స్థానంలో కొత్త విద్యుత్ బస్సులను అదే తరహా సర్వీసులుగా నడపాలని అధికారులు నిర్ణయించారు.
వివరాలు
జులై నుంచి రోడ్డెక్కనున్న విద్యుత్ బస్సులు
ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించారు. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడపనున్నారు. తొలి విడతలో 300 బస్సులు జులై నెలలో రోడ్డెక్కనున్నాయి. మిగిలిన 450 బస్సులు ఆగస్టు నెలలో అందుబాటులోకి రానున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లకు ప్రత్యేక బస్సులు తిరుమల ఘాట్ రోడ్లలో ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ 300 బస్సులను మంజూరు చేసింది. ఇతర నగరాల్లో వినియోగించే విద్యుత్ బస్సులు 12 మీటర్ల పొడవు కలిగి ఉండగా, తిరుమల ఘాట్ రోడ్ల కోసం ప్రత్యేకంగా 9 మీటర్ల పొడవు గల బస్సులను వినియోగించనున్నారు.
వివరాలు
మరో 1,450 బస్సులకు టెండర్లు
ఈ బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా, ఈ వారంలో వాటిని తెరవనున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో మరో 1,450 విద్యుత్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రతిపాదన సిద్ధమైంది. జులై నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
కేంద్ర పథకాల ద్వారా మరో 3 వేల బస్సులు
పూర్వోదయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు విద్యుత్ బస్సులను కేటాయిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి బస్సులు లభించనున్నాయి. అదనంగా గ్రామీణ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో రవాణా సేవలను మెరుగుపరచేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2 వేల విద్యుత్ బస్సులను తీసుకురావాలని రాష్ట్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సీఎన్‌జీ బస్సులకూ ప్రాధాన్యం సీఎన్‌జీ ఇంధనం అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 500 సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి సీఎన్‌జీ సరఫరా సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి.
వివరాలు
ప్రయాణికులకు గందరగోళం లేకుండా..
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సులకు ప్రస్తుతం ఉన్న రంగులనే కొత్త విద్యుత్ బస్సులకూ కొనసాగించనున్నారు. దీంతో ప్రయాణికులు సర్వీసులను సులభంగా గుర్తించగలరని, ఎలాంటి గందరగోళం తలెత్తదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.