Andhra Pradesh: విద్యుత్ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
'పీఎం-ఈబస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఈ బస్సుల నిర్వహణ కోసం ఆయా డిపోలలో అవసరమైన సివిల్, విద్యుత్ పనులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాలకు ఒక్కో చోట 100 బస్సుల చొప్పున కేటాయించగా, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, మంగళం (తిరుపతి), అనంతపురం, కర్నూలు నగరాలకు 50 బస్సుల చొప్పున ఇచ్చారు. ఈ విద్యుత్ బస్సులను పుణెకు చెందిన పినాకిల్ సంస్థ నడపనుంది. అయితే బస్సులు రోడ్లపైకి రావాలంటే ముందుగా డిపోలలో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
వివరాలు
వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభించాలనే లక్ష్యం
ఇందులో భాగంగా సివిల్ పనుల కోసం కేంద్ర వాటాగా రూ.64 కోట్లు,హెచ్‌టీ విద్యుత్ లైన్లు,సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మరో రూ.101కోట్లు మంజూరయ్యాయి. దీంతో డిపోల వారీగా టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. సివిల్ పనులను ఆర్టీసీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టనుండగా,విద్యుత్ సంబంధిత పనులను విద్యుత్ శాఖ ద్వారా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తిచేసి విద్యుత్ బస్సుల సేవలను ప్రారంభించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. విజయవాడ విద్యాధరపురం డిపో నుంచి 100 విద్యుత్ బస్సులు నడపనున్నారు. ఈ డిపో లోతట్టు ప్రాంతంలో ఉండటంతో భారీ వర్షాల సమయంలో నీట మునుగుతోంది. అందుకే ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను తొలగించి,స్థలాన్ని ఎత్తు పెంచి కొత్త భవనాలు నిర్మించనున్నారు.
వివరాలు
డిపో వెనుక భాగంలో ప్రత్యేకంగా విద్యుత్ బస్సుల కోసం నిర్మాణాలు
గుంటూరు-2 డిపో కూడా లోతట్టు ప్రాంతంలోనే ఉండటంతో అక్కడి నుంచి నడిచే 100 విద్యుత్ బస్సుల కోసం డిపోను ఎత్తు చేసే పనులు చేపట్టనున్నారు. నెల్లూరు-2 డిపో నుంచి నడిచే 100 బస్సుల కోసం కూడా సివిల్ పనులు చేయనున్నారు. విశాఖపట్నానికి కేటాయించిన 100 బస్సుల్లో 50ను గాజువాక డిపో ద్వారా నడపనున్నారు. ఇందుకోసం ఆ డిపో వెనుక భాగంలో ప్రత్యేకంగా విద్యుత్ బస్సుల కోసం నిర్మాణాలు చేపడతారు. మిగతా 50 బస్సులను సింహాచలం సమీపంలో కొత్తగా నిర్మించనున్న సింహపురి డిపో ద్వారా నడపాలని నిర్ణయించారు. తిరుపతిలోని మంగళం, అనంతపురం, కడప, కర్నూలు, కాకినాడ, మంగళగిరి డిపోలలో ఇప్పటికే ఉన్న ప్రాంగణాల్లో కొంత భాగాన్ని విద్యుత్ బస్సులకు అనుకూలంగా మారుస్తారు.
వివరాలు
ప్రైవేటీకరణ యత్నాలు ఆపాలి: ఈయూ
వాటి రాకపోకలకు ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలో గుత్తేదారులను ఎంపిక చేసి పనులు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా నడపడం, కొన్ని డిపోలను ఆ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రైవేటీకరణ చర్యలను వెంటనే నిలిపివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విద్యుత్, సీఎన్‌జీ, డీజిల్ బస్సులన్నింటినీ ఆర్టీసీయే నడపాలని, డిపోలను ప్రైవేట్ కన్సార్షియంలకు అప్పగించే నిర్ణయాలను రద్దు చేయాలని ఈయూ అధ్యక్షుడు దామోదరరావు, ప్రధాన కార్యదర్శి నరసయ్య డిమాండ్ చేశారు.