
Andhra Pradesh: 1500 నూతన బస్సుల కొనుగోలుకు సీఎం నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను జోన్ చైర్మన్ నాగరాజుతో కలిసి ఆయన గురువారం తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం ఉరవకొండలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇప్పటికే 1,050 విద్యుత్ బస్సులను కొనుగోలు చేసినట్లు, మరో నెల రోజుల్లో అవి ప్రయాణికుల వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు.
వివరాలు
60 డిపోల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో
రాష్ట్రవ్యాప్తంగా 'స్త్రీ శక్తి' పథకం విజయవంతంగా అమలవుతోందని, ఆ పథకంలో నడుస్తున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (OR) 90 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 129 డిపోలు ఉన్నాయని, వాటిలో 60 డిపోల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు అవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ చంద్రశేఖర్, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలక్ష్మి తదితరులు కూడా పాల్గొన్నారు.