Air Pollution: దిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
దేశ రాజధాని దిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్‌ను దాటేసింది, దీనితో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలోకి చేరింది. దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరిగి, ఈ సీజన్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ వాసులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రకారం, ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పరిగణించబడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో AQI లెవల్స్ 421గా నమోదయ్యాయి.
26 స్టేషన్లు 400 మార్క్‌ను దాటాయి
నగరంలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో 26 స్టేషన్లు 400 మార్క్‌ను దాటాయి. ముఖ్యంగా జహంగీర్‌పురి 466, ఆనంద్ విహార్ 465, బవానా 465, రోహిణి 462, లజ్‌పత్ నగర్ 461, అశోక్ విహార్ 456, పంజాబీ భాగ్ 452తో అత్యధిక స్థాయిలో గాలి కాలుష్యాన్ని నమోదు చేశాయి. ఎయిర్ క్వాలిటీ సూచిక ప్రకారం, AQI 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉందని, 51-100 మధ్య సంతృప్తికరమని, 101-200 మధ్య మితమైన నాణ్యత అని, 201-300 మధ్య తక్కువ నాణ్యత అని, 301-400 మధ్య చాలా పేలవమైనదని, 401-500 మధ్య ప్రమాదకరంగా పరిగణిస్తారు.
ఢిల్లీలో మరోసారి గ్రాప్ 4 ఆంక్షలు అమలులోకి
కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, గాలి నాణ్యత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఢిల్లీలో మరోసారి గ్రాప్ 4 ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీనిలో భాగంగా డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించాయి.