Climate Change Impact: ఆర్కిటిక్‌లో మంచు కరుగుదల.. భారత్‌లో రుతుపవన వర్షాలపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్కిటిక్ మహాసముద్రంలో వేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో ఆర్కిటిక్‌లో మంచు కరుగుతున్న పరిస్థితులు భారత్‌లో నైరుతి రుతుపవనాల సమయంలో పడే వర్షాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అక్కడ మంచు పరిమాణం తగ్గినప్పుడు పశ్చిమ, వాయవ్య భారతదేశంలో రుతుపవనాల చివరి దశలో,అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈసమయంలో రుతుపవనాల గాలులు పశ్చిమ దిశగా మళ్లే ధోరణి కనిపిస్తోంది. పుణెలోని Indian Institute of Tropical Meteorology(ఐఐటీఎం)శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనానికి భాగంగా 1979 నుంచి 2022 వరకు అందుబాటులో ఉన్న వాతావరణ డేటాను వారు విశ్లేషించారు.
వివరాలు
వేగంగా కరుగుతున్న మంచు
భూతాపం ప్రభావంతో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం మరింత వేగంగా వేడెక్కుతోంది. దీంతో అక్కడి మంచు భారీ స్థాయిలో కరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా వేసవి కాలంలో మంచు విస్తీర్ణం క్రమంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరుగుదల ప్రపంచ వాతావరణ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆర్కిటిక్‌లో మంచు కరుగుదల, భారతదేశంలో రుతుపవన వర్షపాతం మధ్య ఉన్న సంబంధం ప్రతి సీజన్‌లో ఒకేలా ఉండదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇదే విషయాన్ని గతంలో National Centre for Polar and Ocean Research నిర్వహించిన అధ్యయనంలో కూడా శాస్త్రవేత్తలు ప్రస్తావించారు.
వివరాలు
స్వల్ప మార్పులు జరిగినా
భారతదేశంలో నైరుతి రుతుపవనాలు దేశ వాతావరణ వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో ఏడాదికి పడే మొత్తం వర్షపాతంలో 75 శాతం కంటే ఎక్కువ వర్షాలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలోనే కురుస్తాయి. ఈ వర్షపాతంలో స్వల్ప మార్పులు జరిగినా కరవులు లేదా వరదలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో రుతుపవనాల వర్షపాతాన్ని ముందుగా అంచనా వేయడం మరింత క్లిష్టంగా మారుతోంది. ఇటీవల సంవత్సరాల్లో సహజ వైవిధ్యం కారణంగా ఈశాన్య భారతదేశంలో నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. మధ్య,ఉత్తర భారతదేశంలో మానవ చర్యల ప్రభావంతో వర్షపాతం తగ్గుదల కనిపిస్తోంది.
వివరాలు
వేగంగా వచ్చి.. కుండపోతగా కురిసి
అయితే వీటికి విరుద్ధంగా పశ్చిమ మరియు వాయవ్య ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రుతుపవనాల మార్పులు, వర్షపాతం అంచనాలపై మరింత లోతైన పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నైరుతి రుతుపవనాల తీరు స్పష్టంగా మారుతున్నట్లు గమనిస్తున్నారు. సాధారణం కంటే వేగంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే ఎక్కువ కాలం పాటు వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. సాధారణంగా పొడి ప్రాంతాలుగా భావించే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇటీవల సంవత్సరాల్లో వర్షపాతం పెరుగుతోంది. మరోవైపు సాధారణంగా అధిక వర్షాలు పడే ఈశాన్య భారతం, ఇండో-గంగా మైదానాలు, హిమాలయ ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గుతున్నట్లు గమనిస్తున్నారు.
వివరాలు
రాజస్థాన్‌లో సాధారణం కంటే 64 శాతం ఎక్కువ వర్షపాతం
వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా చాలా కాలం పాటు పొడి వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 1971 నుంచి 2020 వరకు సేకరించిన డేటా ప్రకారం గత ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే 27 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్,ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం జరిగింది. సెప్టెంబరు నెలలో రాజస్థాన్, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో సాధారణం కంటే 64 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవగా, లద్దాఖ్‌లో 342 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది.