
Puri Jagannath Rath Yatra: 2025 పూరీ జగన్నాథ రథయాత్రకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు,సోదరి సుభద్రతో కలిసి కొలువై ఉన్నాడు. ఈ కారణంగా హిందువులు పూరీని అత్యంత పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలన్నది ప్రతి హిందువు కల. ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు దేశీయంగా మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకుంటారు. ఈ ఏడాది జగన్నాథుని రథయాత్ర జూన్ 27న ప్రారంభం కానుంది. ఇది ఆషాఢ మాస శుక్ల ద్వితీయ తిథిన ప్రారంభమవుతుంది. మొత్తం తొమ్మిది రోజులపాటు ఈ మహోత్సవం కొనసాగుతుంది.
వివరాలు
గర్భగుడిలో ఉన్న ములవిరాటు కూడా ఊరేగింపుకు
ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించి అనేక శుభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఇతర దేవాలయాల్లో ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుగా తీసుకెళ్తారు. కానీ పూరీ శ్రీమందిర్ ప్రత్యేకత ఏమిటంటే - ఇక్కడ గర్భగుడిలో ఉన్న ములవిరాట్లయిన జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలు స్వయంగా మూడు ప్రత్యేకంగా రూపొందించిన రథాలలో ఊరేగుతారు. ఇంకా ఓ విశేషం - ప్రతి ఏడాది రథాలను తాజా కలపతోనే నిర్మిస్తారు. ఒక్కో రథాన్ని తయారుచేయడానికి సుమారు వెయ్యికి పైగా చెక్క ముక్కలను వినియోగిస్తారు. ముఖ్యంగా ఈ నిర్మాణాల్లో ఎలాంటి లోహపు పరికరాలు ..మేకులు, పిన్లు లేదా స్క్రూలు వాడకుండా, సంప్రదాయ కళతో పూర్తిగా చెక్కతోనే నిర్మిస్తారు.
వివరాలు
ఊరేగింపుగా గుండిచా ఆలయానికి..
"మహారాణులు" అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కళాకారుల వంశపారంపర్య నైపుణ్యంతో ఈ రథాలను తయారు చేస్తారు. ప్రతి ఏడాది ఈ రథ నిర్మాణం పూర్తవడానికి రెండు నెలల సమయం పడుతుంది. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు,బలభద్రుడు,సుభద్రలు ఊరేగింపుగా గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈఆలయాన్ని భగవంతుని అత్తగారి ఇల్లు అని భక్తులు భావిస్తారు.అక్కడ ఆయన తన తల్లి చేతి వంటలు స్వీకరిస్తాడు. ఆ తర్వాత భగవంతుడు గుండిచా ఆలయంలో ఏడురోజులు విశ్రాంతి తీసుకుంటాడు. రథయాత్రకు ముందురోజు,అంటే జూన్ 26న గుండిచా ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతుంది. ఆ మరుసటి రోజు,జూన్ 27న రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈతొమ్మిది రోజుల అనంతరం,తిరుగు ప్రయాణం జూలై 5న జరుగుతుంది.అప్పటికి జగన్నాథ స్వామి తన సోదరుడు,సోదరితో కలిసి మళ్లీ శ్రీమందిర్‌కు చేరుకుంటాడు.