
PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత సాయుధ దళాల సామర్థ్యంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో,దేశ రాజధాని ఢిల్లీలో కీలక రాజకీయ, భద్రతా పరిణామాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని నివాసంలో మంగళవారం ఒక అత్యంత కీలకమైన భేటీ నిర్వహించారు.
సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల ప్రధానులు, ఇతర ఉన్నత స్థాయి భద్రతా అధికారులు పాల్గొన్నారు.
వివరాలు
పహల్గాం ఘటనకు తగిన ప్రతిచర్య
ఈ సమావేశంలో దేశ అంతర్గత భద్రత పరిస్థితులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం మన జాతీయ సంకల్పమని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ దృఢనిశ్చయంతో ఉన్నదని స్పష్టం చేశారు. పహల్గాం ఘటనకు తగిన ప్రతిచర్య తప్పదని ప్రధాని హెచ్చరించారు.
వివరాలు
ఊహకందని రీతిలో..
ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా స్పందించినట్లు సమాచారం.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నవారిని నేలమట్టం చేస్తామని స్పష్టంగా హెచ్చరించారు.
అంతేకాదు, ఈసారి భారత చర్యలు వారి ఊహకు కూడా అందనివిగా ఉంటాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలపై ఇప్పటికే ఊహాగానాలు చర్చకు వస్తున్న వేళ, ప్రధానమంత్రిపేర్కొన్న ఈ వ్యాఖ్యలు మరింత ఉత్సాహాన్నిస్తుండటంతో పాటు సైనిక స్పందనకు సంకేతాలుగా భావించబడుతున్నాయి.
వివరాలు
వరుస భేటీలు..
ఇక మరోవైపు, భద్రత సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) బుధవారం భేటీ కానుంది.
ఒక వారం వ్యవధిలో ఇది రెండోసారి సమావేశమవడం గమనార్హం. దీనికి తక్షణాన ప్రధాని మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో సీసీఎస్‌లో ఉన్న అయిదుగురు సభ్యులతో పాటు రవాణా, ఆరోగ్య, వ్యవసాయ, రైల్వే శాఖల మంత్రులు కూడా హాజరుకానున్నారు.
ఈ భేటీలకు ముందే, త్రివిధ దళాధిపతులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమవడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
గత ఘటనల నేపథ్యంతో భద్రతా చర్యలు..
ఇదిలా ఉంటే, 2016లో ఉరిలో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా భారత సైన్యం నియంత్రణ రేఖ వద్ద మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) జరిపింది.
అలాగే, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై జరిగిన ఆత్మాహుతి దాడి అనంతరం భారత ప్రభుత్వం మరింత తీవ్రమైన చర్యలు చేపట్టి మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌ను అమలు చేసింది.
ఇప్పుడు పహల్గాం ఘటనకు సంబంధించి కూడా దేశం అదే ధోరణిలో స్పందించవచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.