Chopper Crash: లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
లేహ్ పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన ఓ హాల్ చీతా కుప్పకూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లద్దాఖ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ కర్నల్‌తో పాటు ఇద్దరు మేజర్లు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయిందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికాధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన మే 20న చోటుచేసుకోగా, తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
వివరాలు
ప్రమాదాల గల కారణాలపై దర్యాప్తు
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం మిగిలిన ఇద్దరు అధికారులతో కలిసి మేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత సైన్యం, వాయుసేనలో దశాబ్దాలుగా చీతా, హెచ్‌ఏఎల్ చేతక్ హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అయితే వీటిలో ఆధునిక సాంకేతికత, భద్రతా ఫీచర్లు తక్కువగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత హెలికాప్టర్ల స్థానంలో కొత్త టెక్నాలజీ, అధునాతన భద్రతా వ్యవస్థలతో కూడిన హెలికాప్టర్లను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.