
Vishakhapatnam: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు శరవేగంగా ఏర్పాట్లు… త్వరలో 'డెక్' భవనంలో కార్యకలాపాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. తాత్కాలికంగా విశాఖపట్టణంలోని సిరిపురం ప్రాంతంలో వీఎంఆర్‌డీఏకు చెందిన డెక్ భవనంలో జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జీఎం సందీప్ మాథుర్ ఆ భవనాన్ని పరిశీలించగా, త్వరలోనే ఇంటీరియర్ డిజైన్, ఫర్నీచర్ కోసం టెండర్లు పిలవనున్నారు. ఈ పనులు 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక వేసి, దసరా నాటికి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
వివరాలు
రెండు అంతస్తుల భవనం, విశాలమైన పార్కింగ్ వసతి
ముడసర్లోవ్ వద్ద శాశ్వత కార్యాలయ భవన నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో, అప్పటి వరకు డెక్ భవనం నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మొదట ఒక అంతస్తు పరిశీలించగా, అది సరిపోదని భావించిన అధికారులు రెండు అంతస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తం 41 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం ఏర్పాటవుతుంది. ఈ భవనంలో సుమారు 450 కార్లకు, 600 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఏర్పాటుకు అవకాశం ఉండటంతో ఈ భవనానికే ప్రాధాన్యం ఇచ్చారు.
వివరాలు
ప్రిన్సిపల్ హెచ్‌వోడీల కార్యాలయాలు కూడా ఇక్కడే
జీఎం కార్యాలయంతో పాటు, 15 మంది ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ల (హెచ్‌వోడీ) కార్యాలయాలను కూడా ఇదే భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దక్షిణ కోస్తా జోన్‌కి ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్‌గా అమిత్ గుప్తాను రైల్వే బోర్డు నియమించింది. త్వరలో టెలికాం, సివిల్, కమ్యూనికేషన్ తదితర విభాగాల హెచ్‌వోడీలను కూడా నియమించనున్నారు. వీరితో పాటు మరో 30 మంది అధికారులు, దాదాపు వెయ్యి మంది సిబ్బంది ఈ కార్యాలయం నుంచే విధులను నిర్వర్తించనున్నారు.
వివరాలు
తూర్పు కోస్తా తరహాలోనే తాత్కాలికంగా కార్యాలయ నిర్వహణ
గతంలో భువనేశ్వర్ ఆధారంగా ఏర్పడిన తూర్పు కోస్తా జోన్ ప్రారంభం కాగానే రెండేళ్లపాటు తాత్కాలిక భవనంలోనే కార్యకలాపాలు సాగాయి. తర్వాత శాశ్వత భవనానికి మారారు. అదే విధంగా దక్షిణ కోస్తా జోన్ కూడా తాత్కాలికంగా డెక్ భవనంలో కొనసాగుతుంది. ముందుగా ఉద్యోగుల సమన్వయం, ఆస్తుల పంచాయితీ వంటి ప్రక్రియలు పూర్తయ్యాకే పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలవుతాయి.
వివరాలు
స్టాఫ్ కేటాయింపుల్లో మార్పులు ఆసాధ్యం
ఇటీవల రైల్వే బోర్డు దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించి సవరించిన డీపీఆర్‌ను ఆమోదించింది. ఇందులో కొత్తగా జీఎం పోస్టును మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, జోన్ ప్రధాన కేంద్రం,విశాఖ డివిజన్‌కి అవసరమైన సిబ్బంది గురించి చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడికక్కడే కొనసాగించేలా కేటాయింపు జరిగింది. అయితే, క్షేత్రస్థాయి సిబ్బంది కేటాయింపులో మార్పులు ఉండే అవకాశముంది. అలాగే, అధికారుల కోసం అవసరమైన నివాసాలను అద్దెకు తీసుకోవాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.