Loading...
Arunachal Pradesh: 'మేం ఈ దేశ పౌరులమే': చైనీస్ అన్న వ్యక్తికి చిన్నారి ధీటైన సమాధానం
'మేం ఈ దేశ పౌరులమే': చైనీస్ అన్న వ్యక్తికి చిన్నారి ధీటైన సమాధానం

Arunachal Pradesh: 'మేం ఈ దేశ పౌరులమే': చైనీస్ అన్న వ్యక్తికి చిన్నారి ధీటైన సమాధానం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మేం భారతీయులమే.. మీ సాటి పౌరులమే..మమ్మల్ని ఇండియన్స్ అనే పిలవండి'అంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఈ బాలిక మాట్లాడిన వీడియో నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న జాతి వివక్షపై మరోసారి చర్చకు తెరతీసింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఆ చిన్నారిని'నువ్వు చైనీస్‌వా?'అని ప్రశ్నించాడు. సాధారణంగా చిన్న వయసు పిల్లలు ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఏం చెప్పాలో తెలియక నవ్వడం, ఏడవడం లేదా అక్కడి నుంచి వెళ్లిపోవడం చేస్తుంటారు. అయితే ఈ బాలిక మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది.తనను చైనీస్‌గా సంబోధించడం తనను ఎంతగా బాధించిందో స్పష్టంగా చెప్పింది.

వివరాలు 

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన యూజర్

'మేం భారతీయులం. మీరు ఇలా చైనీస్ అని పిలిస్తే చాలా బాధగా ఉంటుంది. నాకు కోపం కూడా వస్తుంది. మేం ఈ దేశంలోనే ఉంటున్నాం. ఇటానగర్‌లో నివసిస్తున్నాం. కాబట్టి మమ్మల్ని భారతీయులనే పిలవండి' అని ఆ చిన్నారి చెప్పింది.

ఆమె మాటల్లోని అమాయకత్వంతో పాటు తన గుర్తింపు పట్ల ఉన్న స్పష్టత పలువురిని ఆకట్టుకుంది.

ఈ వీడియోను ఓ సోషల్ మీడియా యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

'భారత్ అంటేనే విభిన్నమైన ముఖాలు, సంప్రదాయాలు, ఆచారాలు, భాషల సమ్మేళనం. ఈ భిన్నత్వాలన్నీ కలిసే మన దేశాన్ని నిర్మిస్తున్నాయి' అనే వ్యాఖ్యను కూడా జత చేశారు. దీంతో వీడియోకు పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి.

వివరాలు 

చిన్ని యువరాణి.. నువ్వు ఎప్పటికీ భారతీయురాలివే..

అయితే ఈ చిన్నారి పేరు ఏమిటి? ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటుచేసుకుంది? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

వివరాలు తెలియకపోయినా.. చిన్నారి చేసిన అమాయకమైన అభ్యర్థనకు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.

'చిన్ని యువరాణి.. నువ్వు ఎప్పటికీ భారతీయురాలివే. అందుకోసం నువ్వు ఎవరికి ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ కొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు.

మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ప్రశ్నలు, వ్యాఖ్యలను తరచూ ఎదుర్కొంటున్నారని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఈ ఘటనతో చిన్నారులు సైతం తమ జాతీయ గుర్తింపు గురించి ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో తెలుస్తోందని, దేశంలోని భిన్నత్వాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..  

ADVERTISEMENT