Arvind Kejriwal: దిల్లీ ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు.. అర్చకులకు నెలకు రూ.18వేల గౌరవ వేతనం
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.
ఆలయాలు, గురుద్వారాల్లో సేవలు అందిస్తున్న పూజారులు, గ్రంథీల కోసం ప్రత్యేక పథకాన్ని ఆయన ప్రకటించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వారికి నెలకు రూ.18,000 గౌరవ వేతనంగా అందజేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
''వారు మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. కానీ,వారి ఆర్థిక పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు'' అని ఆయన అన్నారు.
వివరాలు
రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం
ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభమవుతుందని, దీని ప్రారంభ కార్యక్రమాన్ని హనుమాన్ ఆలయంలో తానే చేపడతానని ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు కలిగించొద్దని బీజేపీను కోరారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాల సీరీస్ కొనసాగించాలని కేజ్రీవాల్ పట్టుదలగా ఉన్నారు.
అందులో భాగంగా వరుసగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు సంజీవని స్కీమ్, మహిళల కోసం మహిళా సమ్మాన్ యోజన కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఆర్థిక సహాయం, ఇప్పుడు అర్చకులకు గౌరవ వేతనం వంటి హామీలను ప్రకటించారు.