Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావడానికి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు. ఈ కేసులో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు కావడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆప్ పేర్కొంది. ఈడీ జారీ చేసిన సమన్ల అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆప్ తెలిపింది. మళ్లీ మళ్లీ సమన్లు పంపే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని ఈడీకి ఆప్ సూచించింది.
ఫిబ్రవరి 17న కోర్టులో విచారణకు హాజరైన కేజ్రీవాల్
దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణ కోసం 2023లో నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో ప్రశ్నించడానినికి కేజ్రీవాల్‌ను ఈడీ పిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19న విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. అయితే సీఎం కేజ్రీవాల్ ఏ ఒక్క నోటీసును కూడా పట్టించుకోలేదు. ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఇంతకుముందు పంపిన సమన్లను విస్మరించినందుకు ఈడీ.. దిల్లీ రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి 17న కోర్టులో విచారణ జరగ్గా.. కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు మార్చి 16కి వాయిదా వేసింది.