Arvind Kejriwal: విశ్వాస పరీక్షను నెగ్గిన కేజ్రీవాల్.. బీజేపీకి వార్నింగ్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ (BJP) కొనుగోలు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ దిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వాస తీర్మానంపై శనివారం చర్చ జరగ్గా.. ఇందులో కేజ్రీవాల్ నెగ్గారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి ఆప్ అతిపెద్ద సవాల్ అవుతుందన్నారు. అందుకే ఆప్‌పై బీజేపీ అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయని అన్నారు.
అందరూ మా వెంటే ఉన్నారు: కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను కోరడం ఇది రెండోసారి. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో తమకు మెజారిటీ ఉందని, కానీ బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నందున ఈ విశ్వాస తీర్మానం అవసరం ఏర్పడిందని కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారలేదని, అందరూ తమ వెంటే ఉన్నారని తాను చెప్పాలనుకుంటున్నానన్నారు. త్వరలోనే తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.