Page Loader
ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు 
ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు

ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు 

వ్రాసిన వారు Stalin
Feb 06, 2024
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు కలకలం రేపాయి. ఆప్ నేతలే లక్ష్యంగా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ సహా పలువురు నేతల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో ఆప్ నేతలకు చెందిన 12చోట్ల ఈడీ దాడులు కొనసాగుతున్నాయని స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈడీ లోపాలను మంగళవారం మీడియా సమావేశంలో బహిర్గతం చేస్తామని దిల్లీ మంత్రి అతిషి ప్రకటించారు. ఈ క్రమంలో మీడియా సమావేశానికి కొన్ని గంటల ముందు ఈడీ దాడులు చేయడం గమనార్హం.

దిల్లీ

ఈడీ బీజేపీకి చెందిన శాఖ: సంజయ్ రౌత్ 

సీబీఐ, ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా డీజేబీ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ సోదాలను నిర్వహిస్తోంది. టెక్నికల్ అర్హత ప్రమాణాలు లేని కంపెనీకి రూ.38 కోట్ల కాంట్రాక్టులను అక్రమంగా కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, టెండర్లు పొందిన కంపెనీ నకిలీ పత్రాలు సమర్పించి బిడ్ పొందినట్లు ఈడీ అభియోగాలు మోపింది. తాజా ఈడీ దాడులపై శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఈడీని బీజేపీకి చెందిన శాఖగా ఆయన అభివర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ తర్వాత బీజేపీ ఎవరినైనా అంగీకరిస్తే అది ఈడీనే అని ఆయన దుయ్యబట్టారు.