Arvind Kejriwal-Tihar Jail: తిహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిస్తోంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
తిహార్ జైలు (Tihar Jail) సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనకున్న చక్కెర వ్యాధి కారణంగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. రక్తంలో చక్కెర నిల్వలు అధికంగా ఉన్నాయని, తనకు ప్రతిరోజు ఇన్సులిన్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు తిహార్ జైల్ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. గ్లూకోజ్ మీటర్ రీడింగ్ లో చక్కెర స్థాయిలు 250 నుంచి 320 మధ్య వరకు చూపిస్తోందని లేఖలో తెలిపారు. ఇది ప్రమాదకర స్థాయి అని వెల్లడించారు.
రాజకీయ ఒత్తిడి వల్లే తప్పుడు సమాచారం ఇస్తోంది: అరవింద్ కేజ్రీవాల్
ఇది ప్రమాదకర స్థాయి అని కేజ్రీవాల్ ఆ లేఖలో వెల్లడించారు. కొన్ని రాజకీయ ఒత్తిడిల వల్ల తిహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎయిమ్స్ వైద్యులు కేజ్రీవాల్ బాగానే ఉన్నారంటూ ఇచ్చిన ఆరోగ్య నివేదికల్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ ఇవ్వకుండా జైలులోనే చంపేందుకు తిహార్ జైలు సిబ్బంది కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) ఆరోపించింది.