Arvind Kejriwal: సీఎం నివాసాన్ని రేపు ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివసిస్తారని సమాచారం. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నందున, ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండబోతోందని తెలిసింది. కేజ్రీవాల్ తన కొత్త నివాసం కోసం వెతుకుతున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటన చేసింది. అందువల్ల, కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇల్లు కోసం చూస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున, తన సమయాన్ని, వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ప్రజలను కలిసేందుకు సౌలభ్యం కోసం.. అశోక్ మిట్టల్ ఇల్లు
ఈ నేపథ్యంలో, ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు కేజ్రీవాల్‌కు వసతి కల్పించేందుకు ముందుకు వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్ వంటి ప్రాంతాలలో నివాసం కల్పించడానికి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారని తెలుస్తోంది. కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేతగా ఉన్నందున, ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాజకీయాల్లోకి రాకముందు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో..
ఆయన తన భార్య, పిల్లలు,వృద్ధ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు.రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్నారు. 2013లో తొలిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత,ఆయన తిలక్ లేన్‌లోని బంగ్లాలో నివసించారు. 2015లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో నివసిస్తున్నారు.