Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ యుద్ధంలో ఇప్పటికే గాజాలో వందలాది మంది చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంఘీభావం తెలపాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అంతేకాకుండా గాజా పౌరులపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దెయ్యంతో పోల్చారు. అతనొక నిరంకుశుడు అని, యుద్ధ నేరస్థుడని మండిపడ్డారు. తాను పాలస్తీనాకు మద్దతుగా నిలబడుతానని ఒవైసీ స్పష్టం చేశారు. గాజా ధైర్యవంతులకు వందనాలని పేర్కొన్నారు.
యూపీ సీఎంపై ఒవైసీ వివర్శలు
భారత్‌లో ఒక బాబా ముఖ్యమంత్రి ( యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్) పాలస్తీనా పేరు పలికిన వారిపై కేసులు పెడతామని అన్నారని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. అందుకే ఆ బాబా ముఖ్యమంత్రికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు, తాను పాలస్తీనా జెండాను, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరించినట్లు వివరించారు. తాను పాలస్తీనాకు అండగా ఉంటున్నట్లు వివరించారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు మోదీ కృషి చేయాలన్నారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇదొక మానవతా సమస్య అన్నారు. అయితే ఇప్పటికే పాలస్తీనాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడును కాంగ్రెస్ ఖండించింది.