LOADING...
Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు అగ్నిప్రమాదం..అత్యవసర ద్వారం మూసివేతే 19 ప్రాణాలకు కారణం
కర్నూలు బస్సు అగ్నిప్రమాదం..అత్యవసర ద్వారం మూసివేతే 19 ప్రాణాలకు కారణం

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు అగ్నిప్రమాదం..అత్యవసర ద్వారం మూసివేతే 19 ప్రాణాలకు కారణం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాలను ఎలా ముప్పులోకి నెట్టుతున్నాయో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది. గత ఏడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నిప్రమాదానికి గురై 19మంది సజీవదహనమైన ఘటనపై రవాణాశాఖ ఆదేశాలతో ఆస్కీ సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ ప్రమాదానికి కారణాలపై విశ్లేషణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యవసర ద్వారాన్ని మూసివేయడం వల్లే ప్రాణనష్టం పెరిగిందని స్పష్టం చేసింది. నివేదికలో బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం బహిర్గతమయ్యాయి.సీటింగ్ బస్సుగా మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 53 సీట్లను తొలగించి 43 నిద్ర బెర్తులుగా మార్చారు.

వివరాలు 

ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటకు రావడానికి మార్గం లేకుండా పోయింది 

2023 మార్చిలో చేసిన ఈ మార్పుల సమయంలో అత్యవసర బయటపడే మార్గాన్ని ఇనుప పైపులతో అడ్డగించారు. దీంతో ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటకు రావడానికి మార్గం లేకుండా పోయిందని నివేదిక పేర్కొంది. అదనంగా, భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించారు. బస్సులో సమాచార వ్యవస్థను తొలగించడంతో పాటు డ్రైవర్ వైపు తలుపును మూసివేసి బిగించారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సరుకులు కూడా రవాణా చేశారు. ఎల్పీజీ సిలిండర్లు, లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన సెల్‌ఫోన్ పార్శిళ్లు బస్సులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సు గంటకు 86 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, రోడ్డుపై ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించకుండా డ్రైవర్ ఢీకొట్టడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది.

వివరాలు 

ప్రమాణాలకు విరుద్ధంగా బస్సు నిర్మాణం

తనిఖీ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా నివేదిక తీవ్రంగా ప్రస్తావించింది. డమన్-డయ్యులో ఫిట్‌నెస్ ధృవపత్రం పొందినప్పటికీ బస్సులో జరిగిన మార్పులను గుర్తించలేదు. అనంతరం ఒడిశాలో మళ్లీ నమోదు జరిగినా, నియమాల ప్రకారం హోమ్ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉన్నా ఏడాది కాలంగా అక్కడికి వెళ్లలేదు. ప్రమాణాలకు విరుద్ధంగా బస్సు నిర్మాణం, అగ్నిమాపక పరికరాల లేమి వంటి అనేక లోపాలే 19 మంది ప్రాణాలను బలితీసుకున్నాయని ఆస్కీ నివేదిక తేల్చి చెప్పింది.

Advertisement