
Ashwini Vaishnaw: 'మ్యాపుల్స్' యాప్‌ను ప్రమోట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ కోసం విస్తృతంగా వాడే గూగుల్ మ్యాప్స్‌కు బలమైన పోటీని అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం ఒక స్వదేశీ యాప్‌కి మద్దతుగా నిలిచింది. భారతదేశంలో తయారైన 'మ్యాపుల్స్'(Mappls)నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్ కంటే మెరుగైన ఫీచర్లతో పనిచేస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. ఆయన ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని మంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్'ఎక్స్'ద్వారా తెలియజేశారు. ఆయన స్వయంగా తన కారులో 'మ్యాపుల్స్' యాప్ ఉపయోగిస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ఈ యాప్‌లో ఫ్లైఓవర్‌లు,ఓవర్ బ్రిడ్జిలు సులభంగా గుర్తించగల సామర్థ్యం,అలాగే అపార్ట్‌మెంట్లలో ఉన్న దుకాణాల వివరాలు స్పష్టంగా కనిపించటం వంటి ఫీచర్లు ఉన్నాయని ఆయన వివరించారు.
వివరాలు
3డీ జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి ఫీచర్లు
మొత్తం 13 రకాల ప్రత్యేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉంటాయని, ఇవి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని చెప్పారు. మంత్రి చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్వదేశీ యాప్‌కు కేంద్ర మంత్రి చేసిన ప్రచారంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'మ్యాపుల్స్' యాప్ ను MapmyIndia సంస్థ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లో 3డీ జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లు, భద్రతా హెచ్చరికలు, అలాగే ప్రాంతీయ భాషల సపోర్ట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రోడ్లు,జంక్షన్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
వివరాలు
ఇప్పటికే 3.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్
మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ MapmyIndia సంస్థ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చడమే తమ లక్ష్యం అని చెప్పారు. దేశ ప్రజలందరూ స్వదేశీ సాంకేతిక విప్లవంలో భాగమవ్వాలని కూడా కోరారు. ఇప్పటివరకు ఈ యాప్‌ను 3.5 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కారులో 'మ్యాపుల్స్' యాప్ ఉపయోగిస్తున్న వీడియోను షేర్ చేసిన మంత్రి
Swadeshi ‘Mappls’ by MapmyIndia 🇮🇳
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 11, 2025
Good features…must try! pic.twitter.com/bZOPgvrCxW