AI Summit: ఏఐ సమిట్ తొలి రోజే అవస్థలు.. క్షమాపణలు చెప్పిన ఐటీ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఆతిథ్యంతో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో అవసరమైన ఏర్పాట్లు సరిగా లేవని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదస్సు తొలి రోజే పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. భారీ క్యూ లైన్లు, ప్రవేశంలో జాప్యం కారణంగా పాల్గొన్నవారు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. సదస్సుకు వచ్చిన వారందరికీ క్షమాపణలు తెలియజేస్తూ, కార్యక్రమం సజావుగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వివరాలు
ప్రభుత్వ తరఫున క్షమాపణలు
"ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు. ఈ రోజు ఒక్కరోజే దాదాపు 70 వేల మంది హాజరయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే, ప్రభుత్వ తరఫున క్షమాపణలు కోరుతున్నాం. మీ సూచనలు మాతో పంచుకోండి. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు మా బృందం అన్ని రకాల చర్యలు చేపడుతోంది" అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
మౌలిక సదుపాయాలు లేవని నెటిజన్లు ఆరోపణ
అయితే, సోమవారం సాయంత్రం ఏఐ సమిట్ ప్రారంభ సమయంలో భారత మండపం వద్ద రద్దీని సిబ్బంది సమర్థంగా నియంత్రించలేకపోయారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అందరికీ సరిపడా కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవని ఆరోపించారు. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లలో యూపీఐ చెల్లింపు సదుపాయం లేకపోవడం, లోపలికి ప్రవేశించేందుకు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల తొక్కిసలాటకు సమానమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని వారు తెలిపారు.