
Asiatic lion: గుజరాత్‌లో 891కి పెరిగిన ఆసియా సింహాల సంతతి.. వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ రాష్ట్రంలోని ఆసియా సింహాల సంఖ్య నాటకీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
2025లో నిర్వహించిన తాజా గణాంకాలను విడుదల చేస్తూ, గతంలో 674గా ఉన్న ఈ మృగరాజుల సంఖ్య ఇప్పుడు 891కి పెరిగిందని తెలిపారు.
ఈ సింహాల పరిధి గిర్ అడవులను దాటి జునాగఢ్, గిర్ సోమనాథ్,భావ్‌నగర్,రాజ్‌కోట్,మోర్బి, సురేంద్రనగర్,దేవభూమి ద్వారక,జామ్‌నగర్,అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్ జిల్లాల వరకు విస్తరించినట్లు వివరించారు.
మే 10, 11 తేదీల్లో ప్రాథమిక జనగణన నిర్వహించగా, తుది లెక్కింపు మే 12, 13 తేదీల్లో జరిగింది.
ఈ ప్రాసెస్‌లో ప్రాంతీయ స్థాయి నుంచి సబ్-జోనల్ స్థాయి వరకు అధికారులు, గణకులు, సహాయకులు, పరిశీలకులు సహా మొత్తం 3,000 మంది వాలంటీర్ల సహకారం అందించారని సీఎం వివరించారు.
వివరాలు
పర్యాటకుల రాక కూడా విస్తృతంగా పెరిగింది: అటవీశాఖ
ఆహారం, తాగునీరు, సంరక్షణ వంటి అంశాల్లో అటవీశాఖ తీసుకుంటున్న జాగ్రత్తలు, అడవుల పరిరక్షణకు చేపట్టిన చర్యలే ఈ పెరుగుదలకు కారణమని పటేల్ అభిప్రాయపడ్డారు.
అడవిలో ఉన్న సింహాలను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇందులో సీసీ టీవీలు, జీపీఎస్, రేడియో కాలర్లు, ఆధునిక ఆయుధాల వినియోగం ముఖ్యమైనవి.
సింహాల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో, వాటిని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో పర్యాటకుల రాక కూడా విస్తృతంగా పెరిగిందని అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి.