
Assam: అస్సాంలో దారుణం.. మాటలు, వినికిడి లోపం ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం..నలుగురి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలోని శ్రీభూమిలో 14 ఏళ్ల చెవిటి, మూగ బాలికపై ఆటోరిక్షాలో గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన బయటపడింది. ఆగస్టు 16న రటాబారి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ఒక మైనర్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులుగా ఇస్లాం ఉద్దిన్, మోనీర్ ఉద్దిన్, దిలావర్ హుస్సేన్, ఒక మైనర్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు తన తమ్ముడితో కలిసి జన్మాష్టమి వేడుకలకు మామ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితులు ఆటోరిక్షాను అడ్డగించి, తమ్ముడిని తోసివేసి, బాలికను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అక్కను అపహరించిన ఘటనను చూసిన తమ్ముడు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
వివరాలు
పోక్సో చట్టం కింద నలుగురి అరెస్టు
దీని తర్వాత పెద్ద ఎత్తున గాలింపు జరిపిన పోలీసులు, కుటుంబ సభ్యులు బాలికను రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో కనుగొన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఆమె అక్కడే స్పృహ తప్పి పడివుండగా, ఆపై ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శ్రీభూమి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్థ ప్రతీమ్ దాస్ ప్రకారం, ఈ కేసులో పోక్సో చట్టం కింద నలుగురిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురిని కోర్టులో హాజరుచేయగా, మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి రిమాండ్ మంజూరైంది. మరో నిందితుడు మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డుకు హాజరుచేసి, షెల్టర్ హోమ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.