Himanta Biswa Sarma: పాకిస్థానీ ఏజెంట్‌తో లింకులు.. గౌరవ్ గొగొయ్‌పై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగొయ్‌కు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సంబంధాలున్నాయని ఆయన విమర్శించారు. 2010 నుంచి 2013 మధ్యకాలంలో అలీ తౌఖీర్ షేక్ 13 సార్లు భారత్‌కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా భారత్ వ్యతిరేక ప్రచారం నిర్వహించిన వ్యక్తిగా ఆయనను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్థానీ ఏజెంట్ అలీతో గౌరవ్ గొగొయ్, అలాగే ఆయన సతీమణి, బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని హిమంత ఆరోపించారు.
Details
ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన
ఒక పాకిస్థానీ సంస్థ ఎలిజబెత్‌కు ఉద్యోగం కల్పించి, అనంతరం భారత్‌కు బదిలీ చేసిందని, ఆమెకు సంబంధించిన జీతభత్యాలను అలీ తౌఖీర్ షేక్‌నే చెల్లించేవాడని తెలిపారు. ఆ తర్వాత ఎలిజబెత్ ఒక భారతీయ సంస్థలో పనిచేసే సమయంలో ఆరు సార్లు ఇస్లామాబాద్‌కు వెళ్లారని, అనంతరం మరో స్వచ్ఛంద సంస్థలో చేరిన తర్వాత మూడుసార్లు పాకిస్థాన్‌ను సందర్శించారని చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అటారీ సరిహద్దు మార్గం ద్వారానే ఆమె ప్రయాణించేవారని, ఎప్పుడూ విమాన ప్రయాణం చేయలేదని పేర్కొన్నారు. ఎలిజబెత్‌కు జరిగిన చెల్లింపుల విషయంలో ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అస్సాం సీఎం ఆరోపించారు.
Details
వివాహానికి ముందు రహస్యంగా పాకిస్థాన్ వెళ్లారని ఆరోపణ
భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె సేకరించి, అలీకి నివేదికల రూపంలో అందించేవారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాతావరణ చర్యలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం సేకరించినట్లు ఆరోపించారు. అలాగే తన భార్యకు సంబంధించిన పాకిస్థానీ బ్యాంకు ఖాతా వివరాలను గౌరవ్ గొగొయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని హిమంత బిశ్వశర్మ విమర్శించారు. ఇక గౌరవ్ గొగొయ్ వ్యక్తిగతంగా కూడా 2013లో, తన వివాహానికి ముందు రహస్యంగా పాకిస్థాన్ వెళ్లారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన అస్సాం సీఎం నివాసంలో ఉంటూ, లాహోర్‌కు మాత్రమే వెళ్లేందుకు వీసా ఉన్నప్పటికీ, ఇస్లామాబాద్ మరియు కరాచీ నగరాలను కూడా సందర్శించారని తెలిపారు.
Details
పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
ఈ పర్యటన గురించి అస్సాం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. పాకిస్థాన్‌లో గడిపిన 10 రోజుల పాటు గౌరవ్ గొగొయ్ పూర్తిగా డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారని, ఆ సమయంలో ఆయనకు ఏదో రకమైన శిక్షణ ఇచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ పర్యటన అనంతరం పార్లమెంటులో రక్షణ పరికరాలు, అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారని హిమంత పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అస్సాం ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన వెంటనే పాకిస్థానీ ఏజెంట్ అలీ తన సోషల్ మీడియా ఖాతాల్లోని అన్ని ట్వీట్లను డిలీట్ చేశాడని తెలిపారు.
Details
కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు
గౌరవ్ గొగొయ్, ఆయన సతీమణికి ఆ ఏజెంట్‌తో సంబంధాలు ఉన్నాయనే విశ్వాసం తమకు ఉందన్నారు. పొరుగు దేశంతో సంబంధాల అంశంపై ఇప్పటివరకు గౌరవ్ గొగొయ్‌ను తాము విచారించలేదని, ఆయన పదవికి గౌరవం ఇస్తూ ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం అంశంపై కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేస్తున్నట్లు హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు.