LOADING...
AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం

AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యే వరకు మాత్రమే సభకు హాజరవ్వాలని వైకాపా నిర్ణయించింది. ఆ తర్వాతి సమావేశాలకు ఆ పార్టీ సభ్యులు హాజరవుతారా? లేదో అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైకాపా పాలన సమయంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపచారం జరిగిందన్న అంశం, పరకామణి చోరీని సెటిల్‌మెంట్‌ చేసిన ఘటనతో పాటు ఇతర వివాదాస్పద విషయాలపై సభ వేదికగా చర్చించేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది.

వివరాలు 

మార్చి 12 వరకు బడ్జెట్‌ సమావేశాలు

అలాగే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న పురోగతి, సూపర్‌-6 అమలు, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం,విద్యారంగ సంస్కరణలు, సామూహిక గృహప్రవేశాలు సహా 20కి పైగా ముఖ్య అంశాలపై చర్చ జరపాలని అధికార పార్టీ తెదేపా బీఏసీ సమావేశంలో ప్రతిపాదించనుంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల కోసం మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి మార్చి 5 నుంచి 7 వరకు జరగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

వివరాలు 

తొలిరోజు సభ వాయిదా

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాలంటూ ఆహ్వానించారు. సమావేశాల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్నకుమార్‌ కూడా హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన వెంటనే తొలిరోజు సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల ఎజెండా, ఏ రోజు ఏ అంశంపై చర్చ జరగాలన్నది, మొత్తం ఎన్ని పని దినాలు సమావేశాలు నిర్వహించాలన్న విషయాలను ఖరారు చేయనున్నారు.

Advertisement

వివరాలు 

సమావేశాల షెడ్యూల్‌ ఇలా ఉండనుందని ప్రాథమిక సమాచారం

బుధవారం గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. 12, 13 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుండగా, చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో సమాధానం ఇవ్వనున్నారు. 14వ తేదీన ప్రభుత్వం బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 15 (ఆదివారం), 16 తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. 17 నుంచి రెండు నుంచి మూడు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగనుంది. అనంతరం శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై చర్చలు చేపట్టే అవకాశముంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.

Advertisement