Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు.. కీలక రాష్ట్రాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో, కేంద్ర అధికార కూటమిపై విపక్షాలు విసిరిన విమర్శలు ఎంత మేరకు ప్రభావం చూపాయో సోమవారం తేలనుంది. వివిధ ప్రాంతాల్లో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉన్నదన్నది కూడా ఇదే రోజు స్పష్టమవుతుంది. హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా అన్నది కొద్ది గంటల్లో బయటపడనుంది. గత నెలలో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ఇవి కొద్ది రాష్ట్రాలకే పరిమితమైనా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశమంతటా ఉత్కంఠ నెలకొంది.
వివరాలు
విందుల ఏర్పాట్లు
ఇప్పటికే లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల్లో అనధికారికుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఈసారి క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డులను అమల్లోకి తీసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీలు గెలుపుపై విశ్వాసంతో ముందుగానే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. విందులు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాషాయ రంగులో "మోదీశ్రీ", ఆకుపచ్చ రంగులో "జోయ్ బంగ్లా" పేర్లతో మిఠాయిలు తయారవుతున్నాయి. రసగుల్లా, రాజ్‌భోగ్ వంటి స్వీట్లు ఆయా రంగుల్లో సిద్ధం చేస్తున్నారు. ముందుగా తెల్లని రసగుల్లాలు తయారు చేసి, గెలిచే పార్టీకి అనుగుణంగా రంగు మార్చి అందించనున్నట్లు తయారీదారులు తెలిపారు.
వివరాలు
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
కేరళలో కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు వేలాది మందికి బిర్యానీ సిద్ధం చేయిస్తున్నారు. కొచ్చిలో విజయోత్సవాల కోసం భాజపా నాయకులు పెద్దఎత్తున లడ్డూలను ఆర్డర్ చేశారు. ఒక స్థానంలో మళ్లీ పోలింగ్ జరగాల్సి ఉండటంతో పశ్చిమ బెంగాల్‌లో మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపుకు 77కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కేంద్రాలను తగ్గించి భద్రతను మరింత పెంచారు. ఈవీఎంలలో మార్పులు జరగవచ్చన్న అనుమానాల నేపథ్యంలో అదనంగా 165 లెక్కింపు పర్యవేక్షకులు, 77 పోలీసు పర్యవేక్షకులను నియమించారు. ఆదివారం భవానీపుర్‌లో లెక్కింపు కేంద్రం వద్ద భాజపా, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉత్తర 24పరగణాల జిల్లాలో భాజపా నేత నివాసంపై కాల్పులు జరిపారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
అస్సాంలో హ్యాట్రిక్‌పై కమలనాథుల ఆశలు
ఈసారీ అస్సాంలో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. కేరళలో ఆసక్తికర సమీకరణాలు ప్రస్తుతం వామపక్ష కూటమి ఆధీనంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఈసారి అది హస్తగతం అవుతుందని, యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే కమ్యూనిస్టులకు 1960 తర్వాత తొలిసారి ఏ రాష్ట్రంలోనూ అధికారం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో స్థిరపడాలని భాజపా కూడా ఆశిస్తోంది. పూంజర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేత పి.సి. జార్జి తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, ఎవరైనా సందేహిస్తే భారీ పందెానికి సిద్ధమని సవాల్ విసిరారు.
వివరాలు
తమిళనాడులో ఉత్కంఠ
సర్వీసు ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లను చేర్చడంతో కేరళలో పోలింగ్ శాతం 79.70కు చేరినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రతన్ కేల్కర్ తెలిపారు. తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని అంచనాలు రావడంతో డీఎంకే శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీ ప్రవేశం నేపథ్యంలో ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 62 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉప ఎన్నికలు జరిగిన 8 స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు సోమవారమే చేపట్టనున్నారు.