అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. త్రిపురలోని మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. నాగాలాండ్, మేఘాలయలో 59స్థానాల చొప్పున ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. నాగాలాండ్‌లో 60స్థానాలు ఉండగా అకులుటో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేఘాలయలో కూడా 60స్థానాలు ఉండగా, సోహియాంగ్ స్థానంలో నిలబడిన అభ్యర్థి మృతి చెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో త్రిపురలో 86.10శాతం పోలింగ్ నమోదైంది. 2018ఎన్నికలలో ఓటింగ్ శాతం కంటే ఈ సారి కొంచెం తక్కువగా నమోదైంది. మేఘాలయలోని 77.55 శాతం, నాగాలాండ్‌లో 85.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
త్రిపురలో బీజేపీ, మేఘాలయలో హంగ్, నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి
ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌రాష్ట్రాల్లో తొలిసారిగా 60అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో కౌంటింగ్ పరిశీలకుడిని ఎన్నికల సంఘం నియమించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులని కౌంటింగ్ పరిశీలకులుగా నియమించినట్లు సీఈవో గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు ప్రకటించారు. త్రిపురలోని 21 హాళ్లలో మూడంచెల భద్రతతో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. త్రిపురలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో హంగ్ వస్తుందని, నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి రెండోసారి అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. అవి నిజమవుతాయా? లేదా? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఘండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.